Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబిత దిగ్భ్రాంతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణాధికారి (సీవోఈ) మహమ్మద్ అబ్దుల్ ఖాలిక్ (57) అనారోగ్యంతో సోమవారం హఠాన్మరణం పొందారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరా బాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారాలు, ఇద్దరు కుమార్తెలున్నారు. అబ్దుల్ ఖాలిక్ ప్రస్తుతం కరీంనగర్ డీఐఈవోగా పనిచేస్తున్నారు. ఆయన హఠాన్మరణం పట్ల ఇంటర్ బోర్డు ఉద్యోగులు, కుటుంబ సభ్యులు బాధలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరయ్యారు. నిజామాబాద్ జిల్లాలో అబ్దుల్ ఖాలిక్ అంత్యక్రియలు ముగిశాయి. ఇంటర్ బోర్డు మాజీ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ పి మధుసూదన్‌రెడ్డితో పాటు ఇతర ఉద్యోగులు, అధ్యాపకులు, కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని ఆయన భౌతికకాయంపై నివాళులర్పించారు. ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణాధికారి అబ్దుల్ ఖాలిక్ హఠాన్మరణం పట్ల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోర్డులో ఆయన ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు. ఆయన మరణం పట్ల సంతాపం, కుటుం బానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఖాలిక్ మరణం పట్ల టిగ్లా అధ్యక్షులు ఎం జంగయ్య, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ సంతాపం తెలిపారు.