Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
- ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-కల్చరల్
బాలల హక్కులను పరిరక్షిస్తూ, వారికి సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కల్పిస్తూ దేశానికి తెలంగాణ మార్గదర్శనం చేస్తోందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 18 ఏండ్లు దాటిన యువతులు వివాహం చేసుకుంటే కల్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి చెప్పారు. హైదరాబాద్లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై సోమవారం రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు బాలల ఆట పాటలు, కేరింతలు మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. బాల రక్షక వాహనం 1098, బాలల రక్షణ సంక్షేమం పోర్టల్, పరిణత బాలల పోర్టల్ సంసిద్ధను మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 372 అంగన్వాడీ కేంద్రాల్లో ఆశా, ఆయాలు బాలలు, స్త్రీ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వల్ల మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నెహ్రు తన కుమార్తె ఇందిరకు రాసిన లేఖలు చదివితే పిల్లలకు మానసిక స్టైర్యం, పట్టుదల, కృషి ఎంత ముఖ్యమో తెలుస్తుందని చెప్పారు. ఆ స్ఫూర్తిని గ్రహించి బాలలు తప్పుడు మార్గంలో వెళ్లకుండా మంచి అలవాట్లు నేర్చుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనను ప్రభావితం చేస్తారన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య మాట్లాడుతూ.. వీధి బాలలకు రక్షణ, వారిపై దుండగుల లైంగిక వేధింపులు, దాడి యత్నాల సమయంలో 1098కు సమాచారం అందిస్తే బాల రక్షక వాహనం వారిని రక్షిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ చైర్మెన్ శ్రీనివాసరావు, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.