Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షెడ్యూల్ విడుదల చేయకుంటే మళ్లీ పోరుబాట
- రాష్ట్ర ప్రభుత్వానికి యూఎస్పీసీ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ముందుగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించి విధివిధానాలపై చర్చించాలని కోరింది. యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం సోమవారం ఎన్ యాదగిరి అధ్యక్షతన హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, వై అశోక్ కుమార్, ఎం రవీందర్, ఎం సోమయ్య, టి లింగారెడ్డి, జాడి రాజన్న, జాదవ్ వెంకట్రావు, డి రాజనర్సుబాబు, బి కొండయ్య, ఎస్ హరికృష్ణ, వై విజయకుమార్, ఆర్ మంగ, ఎన్ దామోదర్, సుధాకర్‌రెడ్డి, విజయసాగర్, రామలింగం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల్లో చేస్తామన్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్నా చేపట్టకపోవడం శోచనీయమని విమర్శించారు. యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఉధృతమైన పోరాటాలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం లేదని తెలిపారు. పాఠశాలల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల్లేక విద్యార్థులకు ఎనలేని నష్టం జరుగుతున్నదని పేర్కొన్నారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఏడేండ్లుగా పదోన్నోతుల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా వివాదం లేని క్యాడర్ల వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టటానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందో అర్థం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈనెలాఖరులోగా బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయకపోతే డిసెంబర్లో మరోసారి పోరుబాట పట్టాలని నిర్ణయించామని తెలిపారు. 317 జీవో అమలు కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను దశలవారీగా స్వంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. 13 జిల్లాల భార్యాభర్తల బదిలీలను అనుమతించాలనీ, ఇతర అప్పీళ్లన్నింటినీ సత్వరమే పరిష్కరించాలని కోరారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్థంగా మారిందనీ, తక్షణమే సర్వీస్ పర్సన్లను నియమించాలని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్న సందర్భంలో సమాంతర ఆంగ్ల మాధ్యమంతోపాటు ఎఫ్ఎల్ఎన్ అమలు తలకుమించిన భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులపై రాతపని భారాన్ని తగ్గించాలనీ, పర్యవేక్షణ ఒత్తిడి తగ్గించి బోధనాభ్యసన ప్రక్రియ సజావుగా సాగేటట్టు చూడాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ముందు యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు విద్యాశాఖమంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు.