Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారిని ఒకే జిల్లాకు బదిలీ చేయండి
- బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల వేడుకోలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మా అమ్మానాన్నలను కలపండి. వారిని ఒకే జిల్లాకు బదిలీ చేయండి. ముఖ్యమంత్రి మాటే ముద్దు. దంపతులు విడిగా వద్దు'అంటూ చిన్నారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా సోమవారం 13 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయులు వారి పిల్లలతో సహా మంత్రి టి హరీశ్‌రావును కలిసి బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ స్పౌజ్ ఫోరం అధ్యక్షుడు వివేక్ మాట్లాడుతూ 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు నిలిచిపోవడంతో పది నెలలుగా తమ కుటుంబాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నాయని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ గతేడాది జరిగిందని వివరించారు. ఈ కేటాయింపుల్లో భాగంగా భార్యాభర్తలైన ఉపాధ్యాయులను వారు కోరుకున్న జిల్లాకు కేటాయించాలంటూ 1655 మెమోను ప్రభుత్వం జారీ చేసిందని గుర్తు చేశారు. 19 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీలను చేపట్టిన ప్రభుత్వం మిగిలిన 13 జిల్లాలపై నిషేధం విధించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా 1,800 మంది ఉపాధ్యాయులు భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వారు బదిలీల కోసం పది నెలలుగా కాళ్లరిగేలా ఎదురుచూస్తున్నారని అన్నారు. మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులను కలిసినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని చెప్పారు. సీఎం మాట కోసం ఉపాధ్యాయ దంపతులు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి ఖాదర్, నాయకులు విజయలక్ష్మి, శిరీష, వరలక్ష్మి, మిన్హాజ్, హబీబున్నీసా, నరేష్ తదితరులు పాల్గొన్నారు.