Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న కేరళ మంత్రి ఎంబీ రాజేశ్, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు-సవాళ్లు...' అనే అంశంపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రస్థాయి సెమినార్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ సెమినార్‌కు కేరళ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎంబీ రాజేశ్, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ముఖ్య వక్తలుగా హాజరుకానున్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, వ్యకాస రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకటరాములు, ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, మహిళా కూలీల కన్వీనింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ బి.పద్మ తదితరులు హాజరుకానున్నారు.
ప్రస్తుతం దేశంలోని 716 జిల్లాలు 7,168 బ్లాక్‌లు 2,69,453 గ్రామ పంచాయితీల్లో ఉపాధి హామీ పని అమలవుతున్నది. 6.77 కోట్ల కుటుంబాలు 15.78 కోట్ల జాబ్‌కార్డులు కలిగున్నాయి. వీటిలో 31.60 కోట్ల మంది కూలీలు తమ పేర్లను పని కోసం నమోదు చేసుకున్నారు. వీరందరూ పని చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం పని కల్పించడం లేదు. దేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 9.95 కోట్ల జాబ్‌కార్డుల్లోని 15.78 కోట్ల మంది కూలీలకే ఇప్పటివరకు పని కల్పించారు. అంటే ఇంకా 50 శాతం మంది కూలీలకు ప్రభుత్వం పని చూపడం లేదన్నమాట. తెలంగాణలో కూడా ఇదే పద్ధతి కొనసాగుతున్నది. 57.17లక్షల జాబ్‌కార్డుల్లో 1.20 కోట్ల మంది పనికోసం పేర్లను నమోదు చేసుకోగా కేవలం 36.73 లక్షల జాబ్‌కార్డుల్లోని 64,79,307 మందికి మాత్రమే ప్రభుత్వం పని కల్పిస్తున్నది. మిగతా వారిని పని లేదంటూ గెెంటేస్తున్నారు. వీరందరికి చేతి నిండా పని దొరకాలంటే కేంద్రం తన బడ్జెట్లో రూ. 2.64 లక్షల కోట్లు కేటాయించడం తప్ప మరో మార్గం లేదని వ్యకాస నేతలు చెబుతున్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీపథకాన్ని ఎత్తేసేందుకు కుట్రలు పన్నుతున్నది. ఎస్సీ,ఎస్టీలకు మాత్రమే పనిని పెట్టాలనీ, కూలాల వారీగా వేతనాలు చెల్లించాలనీ, పథకాన్ని 200 జిల్లాలకే పరిమితం చెయ్యాలనే విధంగా దుర్మార్గపు ఆలోచనలకు పూనుకుంటున్నది. దేశ వ్యాప్తంగా సంఘం చేసిన పోరాటాల ఫలితంగా వాటి నుంచి ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. కానీ దొడ్డి దారిన మెటిరియల్ కాంపోనెంట్ నిధులను పెంచి కాంట్రాక్టర్లుకు పనులను అప్పగిస్తున్నది. అందుకనుగుణంగా బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోత విధిస్తున్నది. ఇలాంటి అంశాలన్నింటిపై సెమినార్లో చర్చించి, పలు తీర్మానాలను చేయనున్నారు.
ఉపాధికి సంబంధించి వ్యకాస ప్రధాన డిమాండ్లు...
1. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీకి రూ.2.64లక్షల కోట్లు కేటాయించాలి. రాష్ట్ర బడ్జెట్లో పట్టణ ప్రాంతాల పనికి కేరళ ప్రభుత్వ మాదిరిగా రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి.
2. పెండింగ్ బకాయిలను విడుదల చెయ్యాలి. గ్రామంలో పోస్టు ఆఫీసు ద్వారా వేతనాలు చెల్లించాలి.
3. ఉపాధి హామీ పనులపై అవగాహన సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి. మేట్లకు, ఫీల్డ్అసిటెంట్లకు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించాలి.
4. పనిముట్లను ప్రతి సంవత్సరమూ ఇవ్వాలి. పని ప్రదేశంలో మెడికల్ కిట్టు, టెంట్, మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలి.
5. బ్లూపాం, పే స్లిప్ ఇవ్వాలి. క్యూబిక్ మీటర్ల కొలతలను రద్దు చేయాలి.నిరుద్యోగ భృతి చెల్లించాలి.
6. సమ్మర్ అలవెన్సును నిలిపేయటం, పని ప్రదేశంలో రెండు పూటలా ఫొటోలు అప్ లోడ్ చేయాలనే సర్క్యులర్లను రద్దు చేయాలి
7. ఫీల్డ్ అసిస్టెంట్లను పర్మినెంట్ చేయాలి. ఖాళీ పోస్టులను సినియర్ మేట్లతో భర్తీ తచేయాలి.
8. మేట్లకు పారితోషికం ఇవ్వాలి. వాచర్స్కి పని గ్యారంటీ చేయాలి.
9. ప్రమాద బీమా రూ.5 లక్షలివ్వాలి. ప్రమాదాలు జరిగితే అన్ని ఆస్పత్రులలో ఉచిత వైద్యం పొందే అవకాశాన్ని కల్పించాలి.
10. ఎస్సీ, ఎస్టీల భూముల అభివృద్ధికి ప్రత్యేక పనులు పెట్టాలి. బోర్‌వెల్స్ వేయాలి.
11. వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు ప్రత్యేక పనులు కల్పించాలి.
12. ఉపాధి పనిని 200 రోజులకు, రోజువారీ కూలీని రూ.600కి పెంచాలి.