Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్‌లో ఇటీవల వెలుగు చూసిన మల్టీలెవల్ స్కామ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తక్కువ పెట్టుబడికి అధిక లాభాలు ఇస్తామంటూ వేలాది మందిని ముంచిన ఘరానా మోసగాళ్లు ఆరు నెలల కాలంలో రూ.1000 కోట్లకుపైగా దండుకున్నారు. వీరి బాధితుల్లో పోలీసులు కూడా ఉండటం గమనార్హం. తమకు న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున తరలి వచ్చిన బాధితులు హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఈ స్కామ్‌కు పథక రచన చర్లపల్లి జైలులో జరిగినట్టు తెలుస్తోంది. అలాగే, ఈ స్కామ్‌లో చర్లపల్లి అధికారులకు కూడా లింక్ ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. పలువురు బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
- జైలు అధికారుల పెట్టుబడులు..?
- ఆరు నెలల్లో రూ.1000కోట్లు స్వాహా
- ఆన్లైన్ ట్రేడింగ్‌లో 10వేల మంది బాధితులు
- బాధితుల్లో పోలీసులు
నవతెలంగాణ - సిటీబ్యూరో
హైదరాబాద్ నగరానికి చెందిన ముక్తిరాజ్ అనే వ్యాపారి హబ్సిగూడాలో 'మల్టీ జట్ ట్రేడ్ ప్రయివేటు లిమిటెడ్' పేరుతో ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నాడు. అంతకుముందు తన ముఖ్య అనుచురుడు బాస్కర్, మరికొంత మందితో కలిసి రియల్ఎస్టేట్ వ్యాపారం నిర్వహించిన ముక్తిరాజ్ అందులో నష్టాలు రావడంతో మల్టీ లెవల్ ట్రేడింగ్‌లు నిర్వహించేవాడు. ఈ క్రమంలో వేలాది మందిని ముక్తిరాజ్ మోసం చేసి చర్లపల్లి జైలుకెళ్లాడు. అయితే, జైల్లోనే 'మల్టీ జట్ ట్రేడ్ ప్రయివేటు లిమిటెడ్'కు అతను శ్రీకారం చుట్టాడు. ఇందులో జైలు అధికారులు సహకరించారని, వారు దాదాపు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఒక యాప్‌ను తయారు చేసిన రాజ్ ఆన్లైన్లో ట్రేడింగ్ ప్రారంభించాడు.
లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రోజుకు 3శాతం వడ్డీ ఇస్తామని నమ్మించాడు. అందులో నుంచి 15శాతం సర్వీస్ చార్జీతోపాటు 18శాతం జీఎస్టీ పోగా మిగిలిన డబ్బులను వాలెట్లో ఉంచేవారు. ట్రేడర్స్ ఆన్‌లైన్‌లోగానీ, బ్యాంక్ అకౌంట్ ద్వారా లేదా నేరుగా డబ్బులు చెల్లించి ట్రేడింగ్ చేసేవారు. బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేసి ఓ ఐడీని ఇచ్చేవారు. ఒక రోజు డబ్బులు డిపాజిట్ చేసిన వారికి మరుసటి రోజు సాయంత్రం విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. గోల్డ్, సిల్వర్, బ్రాన్స్, కాపర్, జింక్, క్రూడాయిల్‌తోపాటు దాదాపు 11 రకాల వస్తువులపై ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవారు. ముంబయి నుంచి ట్రేడింగ్ జరుగుతుందని ఇందులో ఎలాంటి మోసం లేదని, నష్టాలు రావని పెట్టుబడిదారులను నమ్మించారు. ట్రేడింగ్ చేస్తున్న వారు ఇతరులతో కూడా ట్రేడింగ్ చేయిస్తే కమీషన్ చెల్లించేవారు. ఇలా కమీషన్లో 11 స్టెప్లను రూపొందించారు. బాధితులకు నమ్మకం కలిగేందుకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించేవారు. అలాగే వాట్సాప్, ఫేస్బుక్, ఆన్లైన్లో పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 10 వేల మంది ట్రేడింగ్‌లో సభ్యులుగా చేరారు.
రోజుకు వేల్లలో డబ్బులు వస్తుండటంతో ట్రేడర్స్ ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.50లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రతి రోజూ మూడు నుంచి నాలుగు కోట్ల వరకు పెట్టుబడి రూపంలో హబ్సిగూడ కార్యాలయానికి నగదు వచ్చేవని, క్యాష్ మిషన్ల ద్వారా డబ్బులను లెక్కించేవారని తెలిసింది. కొందరు బాధితులు అవసరం కోసం తమ డబ్బులు విత్‌డ్రా చేయాలని కోరడంతో కార్యాలయం సిబ్బంది వాయిదా వేశారు.
ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో గత శుక్రవారం ఈ వ్యవహారం వెలుగు చూసింది. దాంతో పెట్టుబడిదారులు పెద్దఎత్తున డబ్బులను విత్ డ్రా చేయడం మొదలు పెట్టారు. అప్రమత్తమైన ముక్తిరాజ్ ట్రేడింగ్‌ను నిలిపేశాడు. దాదాపు రూ.100 కోట్లకుపైగా డబ్బులను వివిధ బ్యాంక్‌లకు ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలిసింది. నాలుగు రోజులుగా ట్రేడింగ్ నిలిచిపోవడంతో బాధితులు నగరంలో సీసీఎస్‌కు భారీ ఎత్తున తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్టీలెవల్ స్కామ్‌లో చర్లపల్లి అధికారులకు సైతం లింక్ ఉందని బాధితులు ఆరోపించారు. సీసీఎస్‌కు వచ్చిన బాధితుల్లో పోలీస్ కానిస్టేబుళ్లు సైతం ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.