Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు గ్రామ పంచాయతీల ఏకాభిప్రాయ నిర్ణయం
- సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారా!
- అధికారుల తీరుపై నేతల మండిపాటు
నవతెలంగాణ-కొత్తూరు
'మా ఇండ్లు, బోర్లు కూలుతున్నాయి. మా పంటలు సర్వనాశనం అవుతున్నాయి. మా బతుకులు ఆగమవుతుంటే.. ఇటువైపు ఎవరు కన్నెత్తి చూడరు. క్రషర్ గుంతలో పడి పశువులు మరణిస్తున్నా, చర్మవ్యాధులతో మా బతుకులు బుగ్గి పాలు అవుతున్నా పట్టించుకునే నాధుడే లేడు.' అంటూ ప్రజాభిప్రాయ సేకరణలో అడిషనల్ కలెక్టర్ తిరుపతిరావుకు ఏడు గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా ఏకాభిప్రాయంతో తమ ఆవేదన వెలిబుచ్చారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో మైనింగ్ లీజు కాలపరిమితి పూర్తి కావడంతో తిరిగి రెన్యువల్ చేయాలని మైనింగ్ యజమానులు అర్జీ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అడిషనల్ కలెక్టర్ తిరుపతిరావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సంగీతతో కలిసి సిద్దాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామ పంచాయతీలైన సిద్దాపూర్, ఎస్బీపల్లి, కొడిచర్ల, కొడిచర్ల తండా, ఇముల్ నర్వ, వైఎం తాండా గ్రామాల సర్పంచులు, ప్రజలు హాజరై తమ కష్టనష్టాలను ఆయనకు మొరపెట్టుకున్నారు. క్రషర్ మిషన్‌లో భారీ మందు పాతరలు పెట్టి బ్లాస్టింగులు చేస్తుండటంతో బోరు బావులు కూలి పోయి, మోటర్లు భూమి లోపల ఇరుక్కుపోతున్నాయి తీవ్రంగా నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భార్యల పుస్తెలతాడు సైతం అమ్మి బోరు మోటార్లు కొని తిరిగి అమర్చుకున్నా కొద్దిరోజులకే మళ్లీ ఇరుక్కుపోతున్నాయని, బ్లాస్టింగ్ వల్ల వచ్చే దుమ్ము ధూళితో తమ పంటలు నాశనం అవడమే కాకుండా చర్మవ్యాధులు సోకి అప్పులు చేసుకొని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నామని తెలిపారు. లక్షల రూపాయలు పెట్టి ఇల్లు నిర్మించుకొని సంతోషంగా గృహ ప్రవేశం చేయాలనుకున్నా ఆలోపై ఇండ్లకు పగుళ్లు ఏర్పడి శిథిల మైపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రషర్ గుంతలో పడి ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పో యారన్నారు. ఎన్నో పశు వులు సైతం అందులో పడి బయటికి రాలేక ప్రాణాలు వదిలాయని చెప్పారు. ఇంత జరిగినా మమ్మల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారని, ఇప్పటికైనా తమ కష్టాలను అర్థం చేసుకొని తమ జీవితాలను కాపాడాలంటూ అడిషనల్ కలెక్టర్ ముందు ప్రజలు మొర పెట్టుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. మైనింగ్‌పై ప్రజల అభిప్రాయాలు సేకరించామని, దాదాపు అందరూ వ్యతిరేకించినట్టు తెలిపారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.