Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం ఇవ్వని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి
- రైల్ నిలయం ఎదుట కార్మికుల ధర్నా
- జీఎంకు వినతి పత్రం సమర్పించిన వర్కర్స్ యూనియన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంట్రాక్టర్లు రైల్వే కాంట్రాక్టు కార్మికులను మనుషులుగా పరిగణించటం లేదనీ, వారితో యంత్రాల మాదిరిగా పనిచేయించుకుని తగిన వేతనాలు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారని హైదరా బాద్ రైల్వే కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం వెంకటేశ్ విమర్శించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ముందు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా 2022 అక్టోబర్ 1 నుంచి పెరిగిన డీఏ ప్రకారం రూ.18,486 కనీస వేతనం ఇవ్వాలి, ప్రతి కాంట్రాక్టు కార్మికునికి దసరా సందర్భంగా ఒక నెల జీతం బోనస్ వెంటనే ఇవ్వాలి, చట్టం ప్రకారం ప్రతి నెల ఏడో తేదీలోపు జీతాలు ఇవ్వాలి, ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ కార్డు ఇవ్వాలి, వూరు వాంట్ జస్టిస్ అంటూ కార్మికులు నినదిం చారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటాలు నిర్వహిస్తా మంటూ హెచ్చరించారు. ఆ తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌ను యూనియన్ కన్వీనర్ రమేష్ బాబు, ఎం వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి ఎ శాంతులుగౌడ్, నాయకురాలు ఈదమ్మ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వెంకటేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో సుమారు ఏడు లక్షల మంది రైల్వే కాంట్రాక్టు కార్మికులున్నారనీ, వారికి ఎలాంటి చట్టబద్ద హక్కులు అమలు కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న రైల్వే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 18,486 చెల్లించాలని డిమాండ్ చేశారు. రైల్వే యాజమాన్యం ఖర్చు తగ్గించుకోవాలనే పేరుతో కార్మికుల సంఖ్యను తగ్గిస్తున్నదన్నారు. దీంతో ఉన్న కార్మికులపై పనిభారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కార్మికుల సంఖ్య పెంచి టెండర్లను పిలవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు చట్టపరమైన హక్కులు కల్పించాలని అడిగితే..వారిపై కక్ష సాధింపు చర్యలకు కాంట్రాక్టరు పాల్పడు తున్నారని చెప్పారు. రైల్వేలో కాంట్రాక్టర్లది ఆడింది ఆట, పాడింది పాటలాగా ఉందని విమర్శించారు. రైల్వే అధికారులు పట్టించుకోక పోవటం వల్లనే కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రమేష్‌బాబు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై పలు సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయామని చెప్పారు. అయినా వారు పట్టిం చుకోవటం లేదని ఆరోపించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కారట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ సికింద్రాబాద్ జోన్ కన్వీనర్ మహేందర్, సీఐటీయూ నగర కోశాదికారి ఆర్ వాణి, హరీశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.