Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లింక్ రోడ్లతో వాహనదారులకు మేలు
- సీఎం కేసీఆర్ ఆదేశాలతో మెరుగైన రవాణాకు పురపాలక శాఖ చర్యలు
- హైదరాబాద్, శివారు మున్సిపాల్టీల్లో ప్రత్యామ్నాయ ప్రగతి మార్గాలుగా లింక్ రోడ్లు
- రోడ్ల అనుసంధానం కోసం హెచ్ఆర్డీసీఎల్ ఏర్పాటు
- రూ.572కోట్లతో 37 లింకు రోడ్లు
నవతెలంగాణ- సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎస్ఆర్డీపీలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్డు కారిడార్లను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం.. దూరం తగ్గించడానికి లింకు రోడ్లను సైతం నిర్మించింది. జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాల్లోని మున్సిపాల్టీలను అనుసంధానం చేయడానికి అవకాశం ఉన్న ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం కంపెనీల చట్టం ప్రకారం హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్) పేరుతో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలోని మిస్సింగ్ లింక్ కారిడార్లు, స్లిప్ రోడ్లను గుర్తించి అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇవి భవిష్యత్ అభివృద్ధి రంగాలకు వెన్నెముకగా మారతాయి. రవాణా నెట్‌వర్క్‌ను మెరుగుపరచి, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ సమస్యలను తగ్గించడంతోపాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేసే ప్రత్యామ్నాయ మార్గాలుగా లింక్ రోడ్లను నిర్మించాలని నిర్దేశించారు. ఆయా ప్రాంతాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి అధ్యయనం చేసిన తర్వాతనే ఈ లింక్, స్లిప్ రోడ్లను ప్రభుత్వం చేపట్టింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల ప్రజలకు సులభతర రవాణా సదుపాయం కల్పిస్తున్నది. ప్రధాన కారిడార్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే ఈ లింక్ రోడ్ల నిర్మాణ ఉద్దేశం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం 126.20 కిలోమీటర్ల పొడవు కలిగిన 135 లింక్ రోడ్లను ప్రభుత్వం ఖరారు చేసింది. అందులో భాగంగా రూ.572 కోట్ల 17 లక్షలతో 52.36 కిలోమీటర్లు చేపట్టిన 37 పనుల్లో.. రూ.273 కోట్ల 61 లక్షలు విలువైన 24 కిలోమీటర్ల పొడవైన 21 పనులు పూర్తయ్యాయి. ఈ లింక్, స్లిప్ రోడ్లు వినియోగంలోకి వచ్చాయి. మరో 28.36 కిలోమీటర్లు పొడవున్న రూ.298.56కోట్ల విలువైన 16 పనులు పురోగతిలో ఉన్నాయి. పూర్తయిన లింక్ రోడ్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరో 104 రోడ్లు జీహెచ్ఎంసీ, చుట్టుపక్కల 10 మునిపాల్టీల్లోని ప్రాంతాలను అనుసంధానం చేయడానికి రూ.2410కోట్ల అంచనాతో 104 లింక్ రోడ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జీహెచ్ఎంసీలో 95.47 కిలోమీటర్ల పొడవున మొత్తం రూ.1160 కోట్లతో 72 లింక్ రోడ్ల నిర్మాణం, శివారు ప్రాంతాల్లోని 10 మున్సిపాల్టీల్లో రూ.1250కోట్లతో 103.45 కిలోమీటర్ల లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టారు.
మున్సిపాల్టీల్లో..
బండ్లగూడ జాగీర్, బడంగ్పేట్, జవహార్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లు, ఘట్కేసర్, కొత్తూరు, దమ్మాయిగూడ, నాగారం, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మణికొండ మున్సిపాల్టీల్లో లింకు రోడ్ల నిర్మాణం చేపట్టారు. హెచ్ఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో నిర్మించిన లింక్ రోడ్ల ద్వారా అనుసంధానం చేయబడిన ప్రాంతాలు ఇలా ఉన్నాయి.
- ఖాజాగూడ సరస్సు పొడవునా 26-లింక్ రోడ్డు పొడవు 1.40 కిలోమీటర్లు రూ.31.12 కోట్లతో చేపట్టారు.
- లింక్ రోడ్డు రోడ్ నెం.45 నుంచి లెదర్‌పార్క్, ఓల్డ్ బొంబాయి హైవే వరకు పొడవు 1.20 కిలోమీటర్లు రూ.21.69 కోట్లతో చేపట్టారు.
- పాత బాంబే హైవే (లెదర్‌పార్క్) నుంచి రోడ్ నెం.45 వరకు నందిహిల్స్ వద్ద 0.35 కి.మీ పొడవున రూ.30.30కోట్లతో హెచ్‌టీ లైన్ కింద వెహికిల్ అండర్‌పాస్(వీయూపీ) నిర్మాణం చేపట్టారు.
- ఐఎస్బీ రోడ్డు నుండి ల్యాంకోహిల్స్ జంక్షన్ వరకు లింక్ రోడ్డులో కొంత భాగం పొడవు 1.94 కిలోమీటర్లు రూ.17కోట్లతో నిర్మించారు.
- నిజాంపేట్ ఎక్స్ రోడ్ల నుంచి హైటెక్స్ జంక్షన్ వరకు లింక్ రోడ్డు పొడవు 0.75 కిలోమీటర్లకు రూ.6.41 కోట్లు ఖర్చు చేశారు.
- మియాపూర్ మెట్రో డిపో నుంచి కొండాపూర్ వరకు రూ.2.87కోట్లతో చేపట్టారు.
- నోవాటెల్ నుంచి ఆర్టీఏ ఆఫీస్ వరకు లింక్ రోడ్డు, వ్యయం రూ 5.58 కోట్లు.
- చిత్రపురిహిల్స్ మీదుగా ఖాజాగూడ రోడ్డుకు పాత బాంబే హైవే పొడవు 950 మీటర్లకు రూ.15.07 కోట్లు.
- ఖాజాగూడ సరస్సు నుంచి అవుటర్‌రింగ్ రోడ్డు వరకు ఉర్దూ యూనివర్సిటీ కాంపౌండ్వాల్కి సమాంతరంగా కిలోమీటర్ పొడవు, వ్యయం రూ.47.66 కోట్లు.
- సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నుంచి పీర్జాదిగూడ రోడ్డు పొడవు 2.60 కిలోమీటర్లను రూ.25.60 కోట్లతో చేపట్టారు. 4.74 కిలోమీటర్ల మొత్తం ఖర్చు రూ.34.23 కోట్లు అయింది. పైకారిడార్లతోపాటు 12.66 కిలోమీటర్ల పొడవైన 11 ఇతర మిస్సింగ్ లింక్ కారిడార్లను మొత్తం రూ.108.93 కోట్లతో హెచ్ఆర్డీసీఎల్ నిర్మించింది.