Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్లపై ధాన్యం ఆరబోసి రైతుల వెతలు
- ఆకాశం మేఘావృతమైతే ఆందోళన
- మిల్లర్లు, పొరుగు జిల్లాలకు తరలింపు
- సొమ్ము చేసుకుంటున్న దళారులు
రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఖాళీ ప్రదేశాన్ని చూసి ఫ్లెక్సీ పెట్టి కేంద్రాలను తెరిచినట్టు చెబుతున్నా.. కొనుగోళ్లు మాత్రం మొదలుపెట్టకపోవడంతో సమీపంలోని మిల్లులు, దళారులను రైతులు ఆశ్రయిస్తున్నారు. రోడ్ల వెంబడి ధాన్యం ఆరబోసి పగలూ రాత్రి కాపలా కాస్తున్నారు. ఆకాశం మేఘవృతమైతే ఆందోళనతో ధాన్యాన్ని ఒకచోట పోగుచేయడం.. తిరిగి దాన్ని ఆరబోయడం నిత్యప్రయాసగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 506 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. తదనుగుణంగా ఏర్పాట్లు, కొనుగోళ్లు మాత్రం చేపట్టలేదు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లాలో 220 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రేడ్ రకం క్వింటాల్ మద్దతు ధర రూ.2,060గా నిర్ధారించారు. మొత్తం జిల్లాలో 1,17,318 హెక్టార్లలో వానాకాలం వరి సాగు చేశారు. హెక్టార్‌కు 5.683 మెట్రిక్ టన్నుల చొప్పున 6,66,768 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీనిలో స్థానిక అవసరాలకు 1.96 లక్షల మెట్రిక్ టన్నులు, విత్తనాలకు 40వేలు, మిల్లులకు 50వేలు పోగా మొత్తం 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో నవంబర్‌లో 1.70 లక్షలు, డిసెంబర్లో 1.82 లక్షలు, జనవరిలో 67వేల మెట్రిక్ టన్నుల చొప్పున కొనుగోలు చేయాలని అంచనాలు వేశారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 24, ఐకేపీ (డీఆర్డీఏ) ద్వారా 48, పీఏసీఎస్‌లు 144, అగ్రికల్చర్ మార్కెట్లు 4 మొత్తం 220 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరపాలని నిర్ణయించారు. అంతా బాగానే ఉన్నా నవంబర్ అర్థభాగం పూర్తయినా కొనుగోలు లక్ష్యం 1.70 లక్షల్లో పిరికెడు కూడా కొనుగోలు చేయలేదని రైతు సంఘాలు అంటున్నాయి.
గోడు వెళ్లబోసుకుంటున్న రైతులు...
కూసుమంచి మండలంలోనే నాణ్యమైన వరి పండించే గ్రామం జక్కేపల్లి. ఈ గ్రామ రైతులు 'నవతెలంగాణ' ఎదుట మంగళవారం తమ గోడు వెళ్లబోసుకున్నారు. 'ధాన్యం నూర్పిడి చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్నా కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. గతం కంటే సన్నరకానికి ఈసారి మంచి గిరాకీ ఉన్నా.. సమయానికి కేంద్రాలు తెరవకపోవడంతో అమ్ముకోలేకపోతున్నాం. గతంలో జక్కేపల్లి సహకార కేంద్రం ద్వారా రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. కానీ ఈ సీజన్లో కేంద్రాన్ని ప్రారంభించకపోవడంతో అమ్ముకోలేకపోతున్నాం. కొనుగోలు కేంద్రం ప్రారంభించమని కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్ చెప్పినా గోనెసంచులు, లారీల కోసం ఎదురుచూడాల్సి వస్తుందని కొనుగోళ్లు ప్రారంభించడం లేదు. ప్రయివేటు వ్యాపారులకు అమ్మితే క్వింటాకు 5 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. రకరకాల కొర్రీలు పెడుతున్నారు. ఇదిగో ఇలా రోడ్ల పొడుగుతా ఆరబెట్టి.. మబ్బులు పడితే పోగు చేయలేకపోతున్నాం. పగలూరాత్రి కాపలా కాయలేక పోతున్నాం..' అంటూ గుర్వాయిగూడెం రైతు ఎస్.గోవిందరెడ్డి, పాలేరు రైతు దాసరి శ్రీనివాసు, గట్టు సింగారం రైతు సీతారామిరెడ్డి, రైతు సంఘం నాయకులు శీలం గురుమూర్తి వాపోయారు.
కొనుగోళ్లు ప్రారంభించాం..
- మధుసూదన్, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్
ధాన్యం ఇప్పుడిప్పుడే వస్తోంది. కొనుగోళ్లు ప్రారంభించమని నిర్వా హకులకు సూచించాం. జిల్లాలో 220 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే కొన్నిచోట్ల తెరుచుకున్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి గింజా కొంటాం.
జోరుగా వరి కోతలు
- తరలివస్తున్న ధాన్యపు ట్రాక్టర్లు
- సిండికేట్‌తో ధర తగ్గింపు
నవతెలంగాణ-మిర్యాలగూడ
సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో వానాకాలం వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. రికార్డు స్థాయిలో వరి సాగయ్యింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 11 లక్షల ఎకరాల్లో పంట సాగు అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి గాను ఈ దఫా సీజన్ లో సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. నల్గొండ జిల్లాలో సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఆయకట్టు ప్రాంతంలో సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు.ఇందులో 40 శాతం అంటే సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేశారు. ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సివుంది.
సాగర్ ఆయకట్టులో ఎక్కువగా సన్న రకం ధాన్యం సాగు చేశారు. సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు (నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కష్ణ జిల్లాల్లో) ఉంది. కాగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలో వరి కోతలు కోస్తున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా కోతలు చేస్తుండడం వలన అట్టి ధాన్యం నేరుగా మిల్లులకు తరలివస్తుంది. వరి కోతలు జోరుగా సాగుతుండగా సన్నధాన్యంకు మిల్లర్లు ఒకేసారి ధర తగ్గించారు. వారం రోజుల క్రితం సన్నధాన్యం చింట్లు, పూజలు, హెచ్ఎంటి లకు క్వింటా రూ.2300 పైగా ఉండగా ఇటీవల క్వింటా రూ.2000కే మిల్లర్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు కోతలు పెరగడం వల్ల ధాన్యం ఎక్కువగా రావడంతో మిల్లర్లు సిండికేట్ గా మారి ధర తగ్గించారు. ఏకంగా కేవలం రూ.1800, 1850 మాత్రమే ఇస్తున్నారు. కోతలు ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో రూ.1700 కు ధర పడిపోయే అవకాశం ఉంది. వచ్చిన ధాన్యాన్ని మూడు ధరలుగా విభజించి వేస్తున్నారు. వాస్తవానికి క్వింటా ధాన్యానికి ప్రభుత్వం 2160 మద్దతు ధర నిర్ణయించింది. కానీ తొలుతగా ధర మంచిగా ఇచ్చిన మిల్లర్లు ఇప్పుడు ధర తగ్గించి నష్ట పరుస్తున్నారని రైతులు వాపోయారు.