Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నటుడు, దర్శకుడు, నిర్మాత, ప్రజానాయకుడు సూపర్‌స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్థరాత్రి కార్డియక్ అరెస్టుకు గురైన కృష్ణను ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ మంగళవారం వేకువ జామున ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల కృష్ణ చనిపోయినట్లు కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు కాంటినెంటల్ ఆస్పత్రి చైర్మెన్, ఎండీ డాక్టర్ గురు ఎన్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటి నుంచే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు, మూడు గంటల తర్వాత పలు అవయవాలు పని చేయడం మానేశాయి. సుమారు నాలుగు గంటల తర్వాత డయాలసిస్ అవసరం ఏర్పడటంతో అది కూడా చేశాం. ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేశాం. సోమవారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదని మా వైద్యుల బృందం నిర్ధారణకు వచ్చింది. మంగళవారం తెల్లవారు జామున 4.09 నిమిషాలకు కృష్ణ తుదిశ్వాస విడిచారు' అని తెలిపారు. అనంతరం కృష్ణ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు నానక్‌రామగూడలోని ఆయన నివాసానికి తరలించారు. తమ అభిమాన నటుడు ఇకలేరనే వాస్తవాన్ని కృష్ణ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఆయనతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసానికి వచ్చి ఆయన భౌతికకాయానికి ఘన నివాళులర్పించారు. కడసారిగా తమ అభిమాన కథానాయకుడిని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. కృష్ణ భౌతికకాయాన్ని అందరూ సందర్శించేలా గచ్చిబౌలి స్టేడియంలో ఉంచాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే కొన్ని కారణాల వల్ల గచ్చిబౌలి స్టేడియంలో కాకుండా ఫిల్మ్‌నగర్‌లోని పద్మాలయా స్టూడియోలో ఉంచుతున్నట్టు తెలిపారు. అభిమానులు, ప్రముఖుల సందర్శానార్థం కృష్ణ భౌతికకాయాన్ని బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అక్కడ ఉంచనున్నారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఫిల్మ్‌నగర్‌లోని మహా ప్రస్థానంలో కృష్ణ అంతిమ క్రియలు జరుగనున్నాయి.
నట శేఖరుడికి పలువురి ఘన నివాళి...
- గొప్ప మిత్రుడిని కోల్పోయా..
- కృష్ణ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- వృత్తిపట్ల గౌరవమున్న నటుడు : రాహుల్ గాంధీ
- సినీ రంగానికి తీరని లోటు : తమ్మినేని
- ప్రజల గుండెల్లో చెరగని ముద్ర : కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుమారుడు మహేశ్‌బాబుతోపాటు ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసానికి వెళ్లి కృష్ణ భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. కృష్ణ మరణంతో తాను గొప్ప మిత్రుడిని కోల్పోయానని సీఎం కేసీఆర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మన మధ్య లేకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ ఆతిథ్యం మేరకు తాను అనేకసార్లు ఆయన ఇంటికి వెళ్లానని గుర్తు చేసుకున్నారు. కృష్ణ ముక్కుసూటిగా, అరమరికలు లేకుండా మాట్లాడే మనిషని తెలిపారు. 'అల్లూరి సీతారామరాజు సినిమా చూశా..చాలా బావుంది...' అని తాను ఓ సందర్భంలో అంటే... 'కేసీఆర్ గారూ... మీరు సినిమాలు కూడా చూస్తారా...' అంటూ ఆయన చమత్కరించారని సీఎం వ్యాఖ్యానించారు. విలక్షణమైన నటుడిగా, పార్లమెంటు సభ్యుడిగా దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. కృష్ణ నివాసానికి వెళ్లిన సీఎం... ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. కృష్ణ మరణం పట్ల ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కృష్ణ మరణం చాలా బాధాకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అల్లూరి సీతారామరాజు లాంటి సామాజిక చిత్రాల్లో నటించడమే కాకుండా, చాలా సినిమాలను నిర్మించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో నూతన ప్రయోగాలు చేశారని తెలిపారు. కృష్ణ మరణం సినీ రంగానికీ, అభిమానులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కృష్ణ మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన ఎన్నో సామాజిక చిత్రాలను తీసి ప్రేక్షకుల్ని అలరించారనీ, అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా మన్యం వీరుని పాత్రలో నటించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. కృష్ణ పోషించిన పాత్రలన్నీ ఒక ప్రత్యేకతను చాటుకున్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
కృష్ణకు తన వృత్తి పట్ల అమిత గౌరవం, నిబద్ధత ఉండేదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటంటూ ట్వీట్ చేశారు. కృష్ణ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. కృష్ణ భౌతికకాయం వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు తదితరులు నివాళులర్పించారు. శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పీయూసీ చైర్మెన్ జీవన్‌రెడ్డి తదితరులు కృష్ణ మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు.