Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీ చట్టం నిధుల్లో కోత తగదు
- బీజేపీయేతర ప్రభుత్వాలపై గవర్నర్లతో దాడి
- కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలకు ఆటంకాలు
- గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టారు
- కేరళ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ రాజేశ్
- పేదల నోట్లో మట్టికొట్టాలని కేంద్రం చూస్తున్నది : మంత్రి ఎర్రబెల్లి
- ఏప్రిల్ 5న మార్చ్ టూ పార్లమెంట్ : బి.వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగం, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హరిస్తున్నదని కేరళ గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేశ్ అన్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రంపై కలిసికట్టుగా పోరాడాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. తరుచూ ప్రశ్నించే రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐటీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఉసిగొల్పుతూ ఆ సంస్థల ప్రతిష్టతను దెబ్బతీస్తున్నదని విమర్శించారు. కేంద్రం తీరును ప్రశ్నిస్తున్న కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలను మోడీ సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని చెప్పారు. తానేం చేయలేక గవర్నర్లతో దాడి చేయిస్తున్నదని విమర్శించారు. కేరళలో గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లక్షలాది మంది రోడ్లెక్కి నిరసన తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి బీజేపీ తన ప్రభుత్వాలను ఏర్పచుకున్న తీరును వివరించారు. కేంద్రం సరిగ్గా సహకరించకపోయినా ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉపాధి పనుల కల్పనలో ముందు వరుసలో ఉందనీ, కేరళకు ఏడు జాతీయ అవార్డులు రావడమే నిదర్శనమని చెప్పారు. పట్టణప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పనులు కల్పిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 'గ్రామీణ ఉపాధి హామీ అమలు -సవాళ్లు' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంబీ రాజేశ్ మాట్లాడుతూ..యూపీఏ-1 ప్రభుత్వం కమ్యూనిస్టుల ఒత్తిడితో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందనీ, దీని ద్వారా నేటికీ కోట్లాది మంది వ్యవసాయ కార్మికులు లబ్ది పొందుతున్నారని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ ఉపాధి హామీ చట్టం ద్వారా నిధులు వృథా అవుతున్నాయని మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఏటేటా నిధులు తగ్గించటం, కార్పొరేట్ మీడియాతో చట్టంపై కేంద్ర ప్రభుత్వం విష ప్రచారం చేయడం వంటి చర్యలకు పూనుకున్నదని విమర్శించారు. పేదల చట్టం ద్వారా డబ్బులు వృథా అవుతున్నాయంటూ ప్రచారం చేస్తున్న మోడీ...అదే సమయంలో కార్పొరేట్లకు 6 లక్షల 15 వేల కోట్లపైగా పన్ను రాయితీలు ఇచ్చారో ప్రజలకు చెప్పా లని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు కేటాయించకుండా గొంతు నొక్కే ప్రయత్నానికి బీజేపీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. కేంద్రం ఎన్నిక అడ్డంకులు సృష్టించినా కేరళలో ఉపాధి హామీ చట్టాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నా మన్నారు. తమ రాష్ట్రంలో 2016లో 684.12 లక్షల పనిదినాలు కల్పిస్తే ప్రస్తుతం 1059 లక్షల పనిదినాలకు అది చేరిందనీ, ఇది తమ ఎల్డీఎఫ్ ప్రభుత్వం సాధించిన ఘనత అని తెలిపారు.100 రోజుల కల్పించడంలో గతంలో కంటే ఐదు రెట్లు మెరుగైం దని చెప్పారు. ట్రైబల్ ఏరియాల్లో 200 రోజుల ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. ఈ చట్టం ద్వారా చేసే పనుల్లో మహిళలను ఎక్కువగా భాగస్వామ్యం చేయడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. 99.19 శాతం వేతనాలను పని చేసిన 15 రోజుల లోపే కూలీలకు చెల్లిస్తు న్నామనీ, ఒకవేళ ఆలస్యమైతే అధికా రులను బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పనిదినాల కల్పనలోనూ ఆంక్షలు విధించు కుంటూ పోతున్నదని విమర్శించారు.
18 టీమ్‌లు పంపినా ఏమీ చేయలేకపోయారు... : మంత్రి ఎర్రబెల్లి
ఉపాధి హామీ చట్టంలో కఠిన నిబంధనలు తీసుకొస్తూ నిర్వీర్యం చేసే పనిలో మోడీ సర్కారు ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. చట్టాన్ని విజయ వంతంగా అమలు చేస్తున్న తెలంగాణ, కేరళ రాష్ట్రాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కక్ష కట్టి ఆరు నెలలుగా అక్కడ ఉపాధి హామీ చట్టాన్ని నిలిపివేసిందని విమర్శిం చారు. బీజేపీ అధికారంలో లేని ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, పంజాబ్‌లో ఇప్పటికే పర్యవేక్షణ టీమ్‌ల పేరిట వేధింపులు మొదలుపెట్టిందని తెలిపారు. తెలంగా ణలో 2014 నుంచి 2018 వరకు కేవలం మూడు టీమ్‌లను పంపిస్తే... ఈ ఏడాది 18 టీమ్‌లను పంపించి తప్పులు ఎత్తిచూపే ప్రయత్నం చేసి విఫలమైందన్నారు. ఇప్పుడు తాము చెప్పినట్టుగానే పని దినాలు కల్పించా లనీ, 20 రకాల పనులే చేయించాలని కేంద్రం షరతులు పెట్టడం అన్యాయ మన్నారు. రైతు చట్టాలను వ్యతిరేకించి నందుకు తెలంగాణ సర్కారుపై కేంద్రం కక్షగట్టి వ్యవహరిస్తున్నద న్నారు. ఉపాధి హామీ చట్టం కింద గ్రామానికి అవసరమైన పనులు చేయాలిగానీ అవసరం లేని పనులు ఎందుకని ప్రశ్నించారు. రైతు కల్లాలు, శ్మశాన వాటికలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు దీర్ఘకాలింగా ఉపయోగపడతాయనీ, వాటిని కట్టొద్దని చెప్పడం ఏంటని నిలదీశారు. తీర ప్రాంత రాష్ట్రాల్లో చేపలు, రొయ్యలు ఎండ బెట్టుకోవడానికి అను మతించడం, తెలంగాణలో కల్లాలను అడ్డుకోవడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఈజీఎస్ కింద 11 శాతం చెరువు పూడిక పనులు చేస్తే తప్పంట..అదే గుజరాత్ 20 నుంచి 30 శాతం చేసినా తప్పుకాదనటం ఏంటని నిలదీశారు. ఉపాధి హామీ పై కేంద్ర వైఖరికి నిరసనగా జాతీయ స్థాయి లో రాష్ట్రాలు సమష్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
ఉపాధి చట్టం పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాడుతాం: బి.వెంకట్
ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం కేంద్రంతో నిలబడి కొట్లాడు తామనీ, ఏప్రిల్ 5, 2023న మార్చ్ టూ పార్లమెంట్ కార్యక్రమాన్ని చేపడ తామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ప్రకటించారు. ఆలోపు ఊరూరు తిరిగి ప్రజలను చైతన్య పరుస్తామనీ, సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తామని చెప్పారు. డైరెక్టుగా ఉపాధి చట్టాన్ని ఎత్తేస్తే దేశం ఆగమాగం అవుతుందని గ్రహించిన మోడీ క్రమంగా నిధులు తగ్గిస్తూ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శి ంచారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి నాలుగు శాతం నిధులు కేటాయించాలనే నిబంధనకు మోడీ సర్కారు తూట్లు పొడించిందన్నారు. దీనివల్ల తెలంగాణకు వచ్చే దాంట్లో 800 కోట్ల రూపాయల కోత పడింద న్నారు. దీంతో చట్టంపై ఆధారపడ్డ పేదలకు నష్టం జరుగు తున్న తీరును వివరించారు. ఇన్ని పని దినాలే కల్పించాలని కేంద్రం ఆదేశించడం చట్టానికి విరుద్ధమన్నారు. హిట్లర్‌లో దోవలో మోడీ ప్రయాణి స్తున్నారనీ, హిట్లర్‌కు పట్టిన గతే ఆయనకు పడుతుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న విషప్రచారాలను ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. వ్యవసాయానికి ఉపాధి చట్టాన్ని అనుసంధానం చేయడం సరిగాదని నొక్కిచెప్పారు. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం పోరాడాలని సెమినార్ తీర్మానం చేసింది. ఈ తీర్మా నాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు చదివి వినిపించారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణ లోనూ ఉపాధి హామీ చట్టానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలనీ, పట్టణప్రాంతాల్లోనూ పనులు కల్పిం చాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయా లని కోరారు. పనిముట్లు ఇవ్వాలనీ, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరా రు. మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల ను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పనిని 200 రోజులకు పెంచి రోజు కూలి రూ.600లకు పెంచాలని కోరారు. రెండు పూటల ఫొటో అప్లోడ్ చేసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఉపాధి హామీల కూలీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో ఆ సంఘం రాష్ట్ర నాయకులు ప్రసాద్, బి.పద్మ, నారి ఐలయ్య, కొండమడుగు నర్సింహ్మ, ములకలపల్లి రాములు, ఎం.ఆంజనేయులు,రాంచందర్, సైదు లు, శశిధర్, కె.జగన్, వీరయ్య, గోపా ల్, ఎం.వెంకటయ్య, పద్మ, తదితరులు పాల్గొన్నారు.