Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించిన తుది కీని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు. గతనెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గ్రూప్-1 రాతపరీక్షను నిర్వహించామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, వారిలో 2,85,916 మంది అభ్యర్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. గతనెల 31 నుంచి ఈనెల నాలుగో తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించామని తెలిపారు. వాటిని నిపుణుల కమిటీ పరిశీలించి కొన్ని సిఫారసులను ఇచ్చిందని పేర్కొన్నారు. వాటిని కమిషన్ ఆమోదించిన తర్వాత తుది కీని విడుదల చేశామని వివరించారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించేది లేదని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేసి 1:50 నిష్పత్తి చొప్పున మెయిన్స్‌కు 25,150 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు.