Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (రిజిస్టర్ నెంబర్ టీబీసీ 608-1994) చిత్రపురి కాలనీలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. 1994లో అప్పటి ప్రభుత్వం సినీ కార్మికుల కోసం మణికొండ (చిత్రపురి కాలనీ)లోని సర్వే నెంబర్ 246/1లో 67.16 ఎకరాల భూమిని జీవో నెంబర్ 658 ద్వారా కేటాయించిందని తెలిపారు. దీనిలో సినీ వర్కర్స్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ వారు అక్రమాలకు పాల్పడుతున్నట్టు, అధికారులు కూడా పట్టించు కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు, తగు న్యాయం జరిగేలా చూడాలంటూ తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. సహకార సంఘాలచట్టం నియమనిబంధనల ప్రకారం 4213 ఫ్లాట్ల కోసం 4,800 మంది సభ్యులుండాలని తెలిపారు. కానీ 2005-2022 సంవత్సరాలకు సంబంధించిన కమిటీ 9,162 మందికి సభ్యత్వం ఇచ్చిందని వివరించారు. ఈ భూమి విలువ రూ.200 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. కానీ ప్రయివేట్ వ్యక్తులకు కేవలం రూ.22 కోట్లకు మాత్రమే 24 శాతం వడ్డీకి తాకట్టుపెట్టిందని తెలిపారు. ఈ అప్పుల భారాన్ని కూడా సభ్యులపై వేస్తున్నదని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి రూ.116 కోట్ల అక్రమాలు జరిగినట్టుగా ధృవీకరిం చిందని తెలిపారు. ఈ డబ్బును అక్రమార్కుల నుంచి వసూలు చేయకుండా నిర్లక్ష్యం జరుగుతున్నదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చి, వారి వద్దనుంచి కిక్ బ్యాక్స్ రూపంలో 2005-2020 మధ్య కోట్ల రూపాయలు కమిటీ సభ్యులు డ్రా చేశారని వివరించారు. సినీకార్మికులకు తెలియ కుండానే వారి ఇండ్లను బయటివారికి విక్రయించారని పేర్కొన్నారు. ఒక సభ్యుని సభ్యత్వం స్థానంలో సంబంధం లేని మరొకరిని అక్రమంగా చేర్చారని తెలిపారు. ఒకే కుటుంబ సభ్యులకు ఎక్కువ ఇండ్లు కేటాయించారని పేర్కొన్నారు. మైనర్లకూ ఇండ్లు కేటాయించారని వివరించారు. నిర్మాణ ఫండ్, కార్పస్ ఫండ్, డెవలప్మెంట్ ఫండ్ కాజేశారని విమర్శించారు. అక్రమంగా 600 ఇండ్లు నిర్మించినట్టుగా బయట పడ్డాయని తెలిపారు. రూ.150 కోట్లు సినీ కార్మికుల డబ్బు ఏమయ్యిందో కో-ఆపరేటివ్ అధికారులు చెప్పడం లేదని పేర్కొన్నారు. నాలుగు నెలల్లో మొత్తం చిత్రపురిని సరిదిద్దాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చి ఏడాది దాటినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ విధంగా చిత్రపురి కమిటీ సభ్యు లు, అధికారుల అక్రమాలు బయటపడ్డాయని తెలి పారు.
ఈ విషయాల్లో అధికారులు కూడా వారితో కుమ్మక్కయ్యారనీ, అయినా వారినే ఇప్పటికీ కమిటీ సభ్యులుగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలను గతంలో కూడా సీఎం కేసీఆర్ దృష్టికి లేఖ ద్వారా తెచ్చామని గుర్తు చేశారు. ఈ అక్రమాల ను విచారించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.