Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ రాతపరీక్షలో జరిగిన లోపాలను సరిచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. పోలీస్ నియామకాల్లో భాగంగా ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు ఏడు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు.
ఈ పరీక్షల ప్రశ్నాపత్రంలో దాదాపు 22 తప్పులు వచ్చాయని తెలిపారు. దీంతో అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమైన పద్ధతిలో ప్రశ్నాపత్రం లేకపోవడంతో తీవ్ర ఆయోమయానికి గురయ్యారని పేర్కొన్నారు. తప్పుగా ముద్రించిన ప్రశ్నలు గుర్తించకుండా ఫలితాలు వెల్లడించడంతో ఉత్తీర్ణత 31 శాతానికి తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ మంది అర్హత సాధించలేకపోయారని తెలిపారు. అభ్యర్థుల వ్యక్తిగత మార్కుల ఫలితాలు తెలపకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రంలో సూచించిన నిబంధనల ప్రకారం మార్కుల మూల్యాంకనం చేయలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారని తెలిపారు. కావున పోలీస్ నియామక ప్రిలిమినరీ పరీక్షలో జరిగిన తప్పుడు ప్రశ్నలకు మార్కులను కలుపుతూ, ఫలితాలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.