Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజారవాణాను ప్రోత్సహించాలి
- పట్నం వెబినార్లో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పాలకులు అనుసరిస్తున్న పెట్టుబడిదారీ విధానాల వల్లే పర్యావరణ విధ్వంసం జరుగుతు న్నదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రజారవాణాను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని చెప్పారు. కాప్-27 సదస్సులో పర్యావరణంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచదేశాలు, దానిలోనూ తమ విధాన నిర్ణయాలు మార్చుకోవడానికి సిద్ధం కాకపోవడం విచారకరమన్నారు. 'పట్నం' ఆధ్వర్యంలో 'పర్యావరణం-ప్రజారవాణా' అంశంపై మంగళవారం వెబినార్ జరిగింది. పట్టణ ప్రణాళిక, ప్రజారవాణారంగ నిపుణులు డీ నర్సింహారెడ్డి సమన్వయకర్తగా జరిగిన ఈ కార్యక్రమంలో వీఎస్ రావు (సీఐటీయూ), కే ఉమామహేశ్వరరావు (పట్నం), డీజీ నర్సింహారావు, కే శివకుమార్ (రైల్వేస్, ఎమ్ఎమ్టీఎస్ సర్వీసెస్) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజారవాణా ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని విచ్చలవిడిగా పెంచుతూ, పర్యావరణంపై పెడబొబ్బలు పెట్టడాన్ని ఆక్షేపించారు. ప్రభుత్వాలు ఆర్టీసీ, ఎమ్ఎమ్టీఎస్ వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో అమలవుతున్న పలు ప్రజా రవాణా వ్యవస్థల్ని ఉదహరించారు. భారతదేశం పర్యావరణ పరిరక్షణలో పూర్తిగా భిన్న వైఖరితో వ్యవహరిస్తున్నదన్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో వ్యాపారం చేస్తున్నదని విమర్శించారు. ఆ బస్సుల్ని ఆర్టీసీలకు అద్దెకు ఇస్తారే తప్ప, ఆర్టీసీలే ఆ బస్సుల్ని తయారుచేసుకొనే అవకాశాలను మాత్రం కల్పించట్లేదని చెప్పారు. ఎమ్ఎమ్టీఎస్ ఉద్దేశ్యాలను నీరుగారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ కూడా వ్యవహరిస్తున్నదనీ, ఆ రైళ్లను లోకల్ ట్రైన్స్ అంటేనే సబబుగా ఉంటుందన్నారు. ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో తక్కువ ఖర్చుతో కూడిన ప్రజారవాణాను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. మెట్రో రెండో దశ, మూడో కారిడార్ కోసం నిధులు ఇవ్వాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారనీ, ప్రయివేటు రంగంలోని ఆ ప్రాజెక్టు పట్ల చూపించిన శ్రద్ధ ఆర్టీసీలపై కూడా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పాలకులు ప్రభుత్వరంగ ప్రజారవాణాకు చేదోడు అందించాలన్నారు. ప్రజల వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలనీ, సబర్బన్ సహా అన్ని ప్రాంతాలకు మెరుగైన ప్రజారవాణా ఉంటే పర్యావరణం మరింత శ్రద్ధగా పరిరక్షించబడుతుందని చెప్పారు.