Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ
- షేక్‌పేట ప్రభుత్వ పాఠశాల సందర్శన
నవతెలంగాణ-సిటీబ్యూరో
పిల్లలకు విద్యాబోధన ఎంత ముఖ్యమో.. పాఠశాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్) పేరుతో తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు ఎలా జరుగుతుందో తెలుసునేందుకు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ షేక్‌పేట్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. వారితో పుస్తకంలోని పాఠాలను చదివించారు. పిల్లల ప్రగతిపైనా, ఉపాధ్యాయుల బోధన విధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. పాఠశాల ఆవరణ అపరిశుభ్రతపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు బోధన ఎంత ముఖ్యమో.. బడి శుభ్రత కూడా అంతే ముఖ్యమని తగిన చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంతోపాటు ఉపాధ్యాయులను ఆదేశించారు. పిల్లల అభ్యాసనా ఫలితాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆమె వెంట హైదరాబాద్ డీఈవో ఆర్.రోహిణి, డిప్యూటీ ఈవో సామ్యూల్ రాజ్ తదితరులు ఉన్నారు.