Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ వచ్చాకే ఎన్నికలను కార్పొరేట్‌గా మార్చారు
- రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టేందుకు బీజేపీ కుట్ర
- సింగరేణి మైనింగ్లను అరబిందోకి రూ.24 వేల కోట్లకు ఇచ్చింది వాస్తవం కాదా..?: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు
నవతెలంగాణ- మునుగోడు
కోరలు కలిగిన ఎన్నికల కమిషన్ ధృతరాష్ట్రునిలా కండ్లకు గంతలు కట్టుకొని చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు విమర్శించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం బీజేపీ నడుస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలను అదిరించి బెదిరించి ఈడీలను, సీఐడీల ద్వారా దాడులు చేయించడంతోపాటు వారిని లొంగదీసుకుని పార్టీలో చేర్చుకొంటుందని విమర్శించారు. తద్వారా ఎలక్షన్ బాండ్ పేరుతో డబ్బులు వసూలు చేసి ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చుపెట్టి అనైతికంగా గెలవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా డబ్బుతోని గెలవాలన్న దురుద్దేశంతో వేలాది కోట్లు వెదజల్లుతున్నారని, ఎన్నికలను కార్పొరేట్‌గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను మోడీ, అమిత్‌షా టార్గెట్‌గా చేసుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూలగొడుతున్నారన్నారు. రాజగోపాల్‌రెడ్డిని ఒక పావుగా చేసుకొని రాజీనామా చేయించి మునుగోడు ఉపఎన్నిక తీసుకొచ్చారని చెప్పారు. ఎన్నికలంటే ప్రజాస్వామ్యాన్ని బాగుపరిచే విధంగా ఉండాలి కానీ డబ్బును వెదజల్లి ఓట్ల పండగల ఉండకూడదని అన్నారు. ఇలాంటి స్థితిలో నీతివంతంగా నిజాయితీగా పోటీ చేయాలనుకుంటున్న కమ్యూనిస్టులు, సామాన్య ప్రజల పరిస్థితి ఎలా అనే చర్చ మొదలైందన్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న ప్రధాని మోడీ.. ఇటీవల మునుగోడు ఎన్నికలలో తనకు తెలియకుండానే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారా? సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని తడిబట్ట స్నానం చేసిన బీజేపీ నాయకులు సీబీఐ ద్వారా ఎందుకు విచారణ చేయమంటున్నారు.. సిట్ ద్వారా ఎందుకు వద్దంటున్నారని నిలదీశారు. మఠాలలో ఉండే మఠాధిపతులను మంతనాలకు పిలిపించి వారిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శించారు.
సింగరేణి పరివాహక ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన నాలుగు మైనింగ్‌లు సింగరేణివని అగ్రిమెంట్ ఉన్నప్పటికీ.. అరబిందో కంపెనీకి సింగిల్ టెండర్ మీద 24 వేల కోట్లకు ఇచ్చింది వాస్తవమా కాదా చెప్పాలని ప్రశ్నించారు. సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. 2014, 18 ఎన్నికల్లో తమతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని మోసం చేసిందన్నారు. జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, నాయకులు మందడి నరసింహారెడ్డి, అంజయ్య చారి, గురుజ రామచంద్రం, తిరుపారి వెంకటేశ్వర్లు, బచ్చగాని అంజయ్య, బొలుగూరి నరసింహ, గిరి రామ తదితరులు పాల్గొన్నారు.