Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాణాసంచా పేలి ముగ్గురికి తీవ్ర గాయాలు
- హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ చింతా ప్రభాకర్‌కు స్వల్ప గాయాలు
నవ తెలంగాణ-సంగారెడ్డి
టీఆర్ఎస్ నిర్వహించిన బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. బాణాసంచా పేలి ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభం సందర్భంగా చేనేత కార్పొరేషన్ చైర్మెన్ చింతా ప్రభాకర్ నాయకత్వంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చేందుకు హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడకు చెందిన ముగ్గురు యువకులు కుశాల్ అలియాస్ సిద్దు, సందీప్, సుభాష్ అలియాస్ బబ్లూకు కాంట్రాక్టు ఇచ్చారు. తమ ఆటోలో తెచ్చిన బాణాసంచాను ర్యాలీలో కాల్చుతూ ముందుకు వెళ్తున్నారు. కలెక్టరేట్ సమీపంలోకి చేరుకోగా ప్రమాదవశాత్తు పైకి పోవాల్సిన బాణాసంచా తిరిగి ఆటోలో పడిపోయింది. దాంతో ఆటోలోని బాణాసంచాకు నిప్పంటుకుని పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఆటోలో ఉన్న ముగ్గురు యువకులకు నిప్పంటుకుంది. మంటలు అంటుకున్న యువకుల్లో కుశాల్‌కు తీవ్రగాయాలయ్యాయి. సందీప్, బబ్లూలకు సల్పగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన టీఆర్ఎస్ నాయకులు కుశాల్‌కు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. మంటలను ఆర్పుతున్న సందర్భంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్‌కు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే బాధితులను సంగారెడ్డి ప్రభుత్వాపత్రికి తరలించారు. ప్రథమచికిత్స అందించిన వైద్యులు కుశాల్ శరీరం 90 శాతం కాలిపోయిందని తెలిపారు. వెంటనే అతన్ని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 10 టీవీ కెమెరామెన్ వినోద్ బైకుపై నిప్పు రవ్వలు పడ్డాయి. వెంటనే అతను బైక్ వదిలేసి తప్పించుకున్నారు. కాలిపోతున్న బైకును నీళ్లతో ఆర్పారు. గాయపడిన చింతా ప్రభాకర్‌కు వైద్యులు చికిత్స అందించారు. పేలుడు శబ్దాలు విన్న కలెక్టరేట్ సమీపంలోని కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు.