Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్డీ మహాసభల పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డిసెంబర్ 26నుంచి 28 వరకు హైదరాబాద్‌లో జరుగనున్న వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) అఖిల భారత మూడొ మహాసభల లోగోను మంగళవారం హైదరాబాద్‌లో మినిస్టర్ క్వార్టర్స్‌లో వికలాంగుల, వయో వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎన్పీఆర్డీ మహాసభల జయప్రదం కోసం అందరూ కృషి చేయాలన్నారు. వికలాంగుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. వికలాంగుల చట్టాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందున్నదని తెలిపారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వికలాంగులకు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అంగవైకల్యం శరీరానికే తప్ప ప్రతిభకు కాదని చెప్పారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి పరికరాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వినికిడి లోపం కలిగిన వారికి కాక్లియర్ ఇంప్లాంటేశన్ ఆపరేషన్లు ప్రభుత్వం ఉచితంగా చేస్తున్నదని తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకట్, కార్యదర్శి ఎం అడివయ్య మాట్లాడుతూ వికలాంగుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేసి విజయాలు సాధించామన్నారు. కార్యక్రమంలో ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు బి బిక్ష్మయ్య, సంఘం రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేశ్, అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఇంచార్జి జగ్గరాజు, సంఘం నాయకులు సత్యనారాయణ, శివశంకర్, రాజు, ఉష తదితరులు పాల్గొన్నారు.