Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వచ్చే ఏడాది రాష్ట్ర శాసనసభకు నిర్వహించబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్... టీఆర్ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. 'నిత్యం ప్రజలతో ఉండండి.. వారి సమస్యలను పట్టించుకోండి.. బీ అలర్ట్...' అంటూ ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టటంతోపాటు మన రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేల బేరసారాలకు బీజేపీ పాల్పడిన నేపథ్యంలో 'బీ కేర్‌ఫుల్..' అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఆయన హెచ్చరించారు. ఇదే సమయంలో ముందస్తు ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లేది లేదనీ, రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్లు జరుగుతాయని పునరుద్ఘాటించారు.
- ఎన్నికలకు సిద్ధంగా ఉండండి...
- టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం
- ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదు.. షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్లు
- బీజేపీది అహంకారం..ఉన్మాదం...
- పార్టీలో చేరాలంటూ కవితపైనా ఒత్తిడి
- ఆ పార్టీని వదిలిపెట్టబోం
- కాంగ్రెస్‌ది ముగిసిన అధ్యాయం
- పార్టీ మారతారా..? అని అడిగే వారిని చెప్పుతో కొట్టండంటూ వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ఈ భేటీలో చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ సీఎం ఈ సందర్భంగా సూచించారు. ఎనిమిది రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారాన్ని బట్టబయలు చేశామని తెలిపారు. తద్వారా ఆ పార్టీ కుట్రలను ప్రపంచం ముందుంచామని వివరించారు. అహంకారం, ఉన్మాదంతో వ్యవహరిస్తున్న బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గత ఎనిమిదేండ్లలో తమపై అనేక కేసులు బనాయించినప్పటికీ ఏ ఒక్కటీ రుజువు చేయలేకపోయిందని విమర్శించారు. బీజేపీ వద్ద రూ.రెండు లక్షల కోట్లు ఉన్నాయంటూ సింహయాజీ చెబుతున్నారు... ఆ పార్టీకి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. మున్ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా ఈడీ దాడులకు పూనుకోవచ్చనీ, అయినా భయపడాల్సిన పనిలేదని భరోసానిచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో త్వరలో కొంతమందిని అరెస్టు చేసే అవకాశముందని తెలిపారు. మునుగోడులో బీజేపీ గుండాగిరీ చేసిందని సీఎం విమర్శించారు. అక్కడి ప్రజలు తమ పార్టీ వైపు ఉండటాన్ని ఆ పార్టీ సహించలేకపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్‌ది ముగిసిన అధ్యాయమంటూ సెటైర్లు విసిరారు. ఎవరేం చేసినా ఆ పార్టీ బతకదనే స్పష్టతకు రాహుల్ గాంధీ వచ్చారనీ, అందుకే ఆయన గుజరాత్లో పాదయాత్ర చేయటం లేదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 95 సీట్లను అవలీలగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వంద మంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జిని నియమించు కోవాలంటూ ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ మారుతారా అని ఎవరైనా ఫోన్ చేస్తే.. చెప్పుతో కొడతా అని గట్టిగా సమాధానం చెప్పాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు సూచించారు.
'మన పార్టీ ఎమ్మెల్యేలు బాగా పనిచేయాలి. ఎమ్మెల్యేలను మార్చాలన్న ఉద్దేశం లేదు. సర్వేలన్నీ టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయి. వందశాతం అధికారం మళ్లీ మనదే. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లబ్ధిదారుల పూర్తి సమాచారం ఎమ్మెల్యేల వద్ద ఉండాలి. ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలి. బీజేపీ నుంచి ఎదురయ్యే దాడిని సమర్థంగా తిప్పికొట్టాలి. మునుగోడు తరహాలో పటిష్ట ఎన్నికల వ్యూహాన్ని తయారు చేయాలి. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకం కావాలి. ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. టీఆర్ఎస్ కార్యకర్తల బలంతో ఎమ్మెల్యేలందరూ ఓటర్లను చేరుకోవాలి. ఎమ్మెల్సీ కవితను కూడా తమ పార్టీలో చేరాలంటూ బీజేపీ ఒత్తిడి చేసింది...' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమావేశానికి టీఆర్ఎస్ జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా హాజరయ్యారు.