Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీపీఏ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఆందోళన
- హాజరైన తెలంగాణ, ఏపీ అధికారులు
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చే ముంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి కొన్ని వివరాలు సమర్పించింది. బ్యాక్ వాటర్ కారణంగా 892 ఎకరాలు ముంపునకు గురవుతోందని, స్థానిక ప్రవాహాలు, డ్రైనేజీ తదితరాల కారణంగా ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం హైదరాబాద్‌లో పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో ముంపు, ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ, ఇతర సమస్యలు, ఆర్ఆర్ ప్యాకేజీ, తదితర అంశాలపై అధికారులు చర్చించారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తరలించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతుల్లేకుండా ఎత్తిపోతల పథకాలు చేపట్టిందంటూ ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు అన్నిరకాల అనుమతులు వచ్చాయనీ, ఉమ్మడి అధ్యయనం, సర్వే అంటూ ఏమీ ఉండబోదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టంచేశారు. జాతీయ ప్రాజెక్టుకు అనుమతులు రావడం పిల్లచేష్టలు కాదని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న వర్కింగ్ సీజన్లో పోలవరం ప్రాజెక్టు పనుల లక్ష్యాలు, వనరులపై ప్రణాళిక సిద్ధం చేసి ఆమోదించినట్టు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. ప్రధాన డ్యామ్‌కు సంబంధించిన పనుల ప్రారంభం కోసం డయాఫ్రమ్ వాల్ పరిస్థితిని పరీక్షిస్తామని, ప్రధాన డ్యామ్ గ్యాప్ పనులను 2023 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రతిపాదించిన ఉమ్మడి సర్వే ప్రతిపాదనపై ఏపీ తీవ్రంగా స్పందించింది. నచ్చినట్టు నివేదికలు వచ్చే వరకు అధ్యయనం చేయాలా? అని శశిభూషణ్ ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సుప్రీంకోర్టు తెలిపిందని.. అయితే ఇప్పటివరకు జరిగిన రెండు సమావేశాల్లో ఎలాంటి ఫలితం లేదన్నారు. ఏకాభిప్రాయం కోసం త్వరలోనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రెండో దశ భూసేకరణలో మరో 30 నుంచి 40 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని... ఇందుకోసం షెడ్యూల్ సిద్ధం చేసి ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, సీఈ మొహన్ కుమార్, ఇఇ సుబ్రమణ్య ప్రసాద్, కేంద్ర జలసంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.