Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జన జాతీయ గౌరవ దినోత్సవాలలో భాగంగా బుధవారం హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ శాఖలో పలు గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గిరిజన సహకార సంస్థ చైర్మెన్ వాల్యా నాయక్, గిరిజన ఆర్థికాభివృద్ధి సహకార సంస్థ చైర్మెన్ ఇస్లావత్ రామచందర్ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నత అధికారులు తెలంగాణ గిరిజన స్వాతంత్య్ర సమరయోధులైన రాంజీ గోండ్, కుమ్రం భీమ్, బంజార గురువు సంత్ సేవాలాల్, గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళి అర్పించారు. అనంతరం గిరిజన చిత్రాలు, దారు, లోహ శిల్పాలు, ఎంబ్రాయిడరీ మొదలైన హస్తకళల ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమం లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన ఆంధ్ర, గోండ్, తోటి, పర్థాన్, కోయ, లంబాడీ, కోలామ్ మొదలైన గిరిజన తెగలకు చెందిన పలు కళాకారుల బృందాలు తమ తమ సాంస్కృతిక కళలను ప్రదర్శించాయి. మేడారం జాతర చైర్మెన్ కొర్నిబెల్లి శివయ్య ఆధ్వర్యంలో రూపొందించిన అరుదైన కోయ ధర్మ స్తంభాన్ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగు గారి సూచనల మేరకు నెహ్రూ శతజయంతి గిరిజన మ్యూజియంలో ప్రతిష్టించారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ గిరిజన సమర యోధుడు కుమ్రం భీమ్ వారసుడు కుమ్రం సోనేరావు, గిరిజన పద్మశ్రీలు కనక రాజు, సకినె రామచంద్రయ్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సాంస్కతిక శిక్షణ పరిశోధన సంస్థ సంచాలకులు విట్టా సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శంకర్, జీసీసీ జీఎం శ్రీల సీతారామ్ తదితర ఉన్నతాధికారులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.