Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి
నవెతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి చెప్పారు. రికార్డులు సరిగా లేకుండా చేసిందని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో భూరికార్డులు సర్వే చేయాలని నిర్ణయించామని గుర్తు చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. భూముల సర్వే కోసం కేంద్రం నుంచి ముఖ్యమంత్రి డబ్బులు తెచ్చుకున్నారనీ, ఎక్కడ కూడా ఇంత వరకు సర్వే చేయలేదని విమర్శించారు. మరోవైపు ఎన్నికల కోసం ముఖ్యమంత్రి హడావిడిగా చేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జులై ఒకటి నుంచి భూసర్వేను నిర్వహించబోతున్నారని గుర్తు చేశారు. విదేశాల్లో దివాళా తీసిన ఓ కంపెనీకి ధరణి నిర్వహణను అప్పగించిందన్నారు. పోడు భూములపై ఇంత వరకు నివేదిక బయటకు రాలేదని విమర్శించారు.
మండల కమిషన్ సిఫారసులు ముందుకు రాలేదు
మాజీ ఎంపీ వి.హనుమంతరావు
దేశానికి ఓబీసీ ప్రధాని అయినందుకు ఎంతో సంతోషపడ్డామనీ, అయతే మోడీ అధికారంలోకి వచ్చాక మండల కమిషన్ సిఫారసులు ముందుకు రాలేదని మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆవేదనవ్యక్తం చేశారు. ఎనిమిదేండ్ల కాలంలో ఒక పని కూడా చేయలేదని విమర్శించారు. క్రిమిలేయర్ ఎత్తేయలంటూ ఓబీసీ పార్లమెంట్ సభ్యులుగా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామనీ, కానీ ఇంత వరకు తొలగించలేదని చెప్పారు. మునుగోడు ఓటమిపై సమీక్షించాలని కోరినప్పటికీ ఇప్పటివరకు నిర్వహించడం లేదని చెప్పారు.
తరుణ జోషివి తప్పుడు ఆరోపణలు
బక్క జడ్సన్
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళా అధికారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తాను ఫిర్యాదు చేస్తే.. కమిషనర్ విచారణ జరిపి నాపై అనుచిత నివేదిక ఇచ్చారని చెప్పారు. ఆయన టీిఆర్‌ఎస్ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తిగిరి తనపైన్నే ఆయన చేసిన ఆరోపణలు నిరూపించాలనీ,లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం అభద్రతాబావంతో మాట్లాడారు
మల్లు రవి
తన కుమార్తె కవితను బీజేపీలోకి రావాలని అడుగుతున్నారంటూ సీఎం కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు అన్నారు. గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబితే నమ్మలేదనీ, సీఎం మాటలతో అది నిజమని తేలిందన్నారు. పార్టీ మారమని అడిగితే చెప్పుతో కొట్టాలని అంటున్న కేసీఆర్... 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా విలీనం చేసుకున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను భయపెట్టడానికే సమావేశం నిర్వహించారా? అని ప్రశ్నించారు.