Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నది కేసీఆర్నే : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బ్రోకర్ల కాల్లిస్టు బయటకు తీయిస్తే సీఎం కేసీఆర్ నాటకం బట్టబయలు అవుతుందనీ, ఇజ్రాయిల్ టెక్నాలజీతో ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇన్ని రోజులు గడిచినా ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు బయటకు రానిస్తలేడో సమాధానం చెప్పాలని బండి డిమాండ్ చేశారు. సీఎంకు దమ్ముంటే దక్కన్ కిచెన్ హౌటల్, ఫాంహౌజ్, ప్రగతి భవన్లోని సీసీ పుటేజీలను సేకరించి విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ తిరిగినా ఆయన్నే దేఖడం లేదనీ, ఆయన బిడ్డను తమ పార్టీలో ఎలా చేర్చుకుంటాం అని ప్రశ్నించారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లడంలేదని చెప్తే ముందస్తుకు సిద్ధమవుతున్నట్టేనని చెప్పారు. 37 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న మిమ్ముల్ని ఏం చేయాలని కేసీఆర్ను ప్రశ్నించారు. ఆయా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి వెళ్లే దమ్ముందా? అని సవాల్ విసిరారు. మునుగోడులో ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించిన నీచుడని విమర్శించారు.
కోవర్టులను గల్లాపట్టి బజారుకు లాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మనుగోడులో ఒక్కో ఎమ్మెల్యే తమ పోలింగ్ బూత్ అధ్యక్షునితో సమానం అని చెప్పారు. సీట్ల కోసం, పోస్టింగుల కోసం బ్యూరోక్రసీ సీఎం కాళ్లు మొక్కడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, కోశాధికారి బండారి శాంతికుమార్, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణి రుద్రమదేవి, జె.సంగప్ప పాల్గొన్నారు.