Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్‌శాఖ మంత్రికి టీఎస్‌పీఈఏ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ సంస్థల్లో తెలంగాణ స్థానికత ఉద్యోగుల ప్రమోషన్లను రివర్షన్ చేయవద్దని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఈఏ) ఆ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షులు పీ రత్నాకరరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ ఏ వెంకటనారాయణ, అడిషనల్ జనరల్ సెక్రటరీ అంజయ్య, ప్రధాన కార్యదర్శి పీ సదానందం తదితరులు బుధవారం మంత్రిని కలిసి, వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రా స్థానికత పేరుతో తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ చేయబడిన ఉద్యోగుల స్థానంలో తెలంగాణ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చారనీ, ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు, తీర్పుల పేరుతో రివర్షన్ చేయాలని యాజమాన్యాలు ఆలోచిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీన్ని కచ్చితంగా నిలుపుదల చేయాలని కోరారు. రివర్షన్లు జరిగితే ఉద్యమించడం తప్ప, తమకు మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రా ఉద్యోగులను తొలగించాక, రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరా, స్వరాష్ట్ర ప్రతిష్టకోసం తెలంగాణ విద్యుత్ ఇంజినీర్లు చాలా కష్టపడ్డారని గుర్తుచేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, సీఎమ్‌డీలతో మాట్లాడి, తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.