Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపాదించిన రెడ్కో చైర్మెన్ వై సతీష్ రెడ్డి
- సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టీఎస్ఐఐసీ ఖాళీ స్థలాల్ని కేటాయించాలని ఇంధన పునరుత్పాదక శక్తి అభివద్ధి సంస్థ (రెడ్కో) చైర్మెన్ వై సతీష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం నాడాయన రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామా రావుకు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టీఎస్ఐఐసీ, ఐటీ సెక్టార్, టీహబ్, టీ వర్క్స్‌కు చెందిన ఖాళీ స్థలాల్లో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి హైదరాబాద్‌లో టీఎస్ఐఐసీకి చెందిన 28 ప్రాంతాలు అనువుగా ఉన్నాయని గుర్తించామన్నారు. పరిశ్రమల శాఖ ఆ స్థలాలు ఇస్తే, రెడ్కో నేషనల్ క్లీన్ ఎనర్జీ ప్రోగ్రాం స్కీం కింద డీసీ ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని వివరించారు. ఇది రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల మౌలికవసతుల కల్పనకు ఉపయోగపడుతుందని సూచించారు. ఈ ప్రతిపాదనపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామనీ, దానిలో భాగంగానే దేశంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్‌ను ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలిపారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే హైదరాబాద్‌లో 292 ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, మున్సిపల్ పార్కింగ్ కేంద్రాలు, బస్ డిపోలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రాంతాలు, పెట్రోల్ బంకుల్లో 1,301 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రెడ్కో ప్రయత్నాలు చేస్తున్నదని వివరించారు.