Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాగజ్‌నగర్ రూరల్, రెబ్బెన పోలీస్స్టేషన్లను ప్రారంభించిన మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ-కాగజ్‌నగర్ రూరల్/ఆసిఫాబాద్
శాంతి భద్రతల పరిరక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సత్వరం సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నూతనంగా నిర్మించిన కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రూరల్, రెబ్బెన పోలీస్స్టేషన్లను బుధవారం ప్రారంభించారు. కాగజ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాంకిడి, కౌటాల, పెంచికల్పేట్, చింతలమానెపల్లి పోలీస్‌స్టేషన్ శిలాఫకాలను ఆవిష్కరించి వర్చువల్ ద్వారా నూతన పోలీస్‌స్టేషన్ భవనాలను ప్రారంభించారు. అంతకుముందు హరితహారం కార్యక్రమంలో భాగంగా రూరల్ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో మంత్రులు మొక్కలు నాటారు. రూరల్ పోలీస్ స్టేషన్‌లోని అన్ని గదుల్లో కలియతిరిగారు. పోలీస్‌స్టేషన్‌లో నిర్మించిన ఎస్హెచ్ఓ గదిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మహిళా ఎస్ఐ సోనియాను కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు. స్టేషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కమ్ వెయిటింగ్ హాల్, ఎస్హెచ్ఓ, రైటర్ రూమ్, ఇంటర్వ్యూ గది, కమ్యూనికేషన్ రూమ్, సీసీ కెమెరాలను మంత్రులు, డీజీపీ మహేందర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధితో పాటు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ప్రజల సౌకర్యార్థం ఖర్చుకు వెనుకాడకుండా నూతన భవనాలను మంజూరు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ దిశానిర్ధేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా సమస్యల పరిష్కారం కోసం పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరిచారని, వేలాది పోలీస్ పోస్టులను భర్తీ చేశారని వివరించారు.
అనంతరం కోయవాగు గ్రామపంచాయతీ పరిధిలో గల బల్గలలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన మైనారిటీ బాలుర పాఠశాల, కళాశాల భవనాలను మంత్రి మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. ఇటీవల కూలిన అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జిని మంత్రులు పరిశీలించారు. వంతెన మరమ్మతులకు పనిచేయని పక్షంలో రోడ్డు భవనాల శాఖ మంత్రితో మాట్లాడి నూతన వంతెన మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. జూనియర్ కళాశాలలో కోనేరు ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రులు పరిశీలించారు.
కార్యాలయ పనుల పరిశీలన
డీజీపీ మహేందర్‌రెడ్డి తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్‌తో కలిసి ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ పనులు పూర్తయితే సీఎం పర్యటన ఉంటుందన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో నిర్మిస్తున్న డీపీఓ కార్యాలయాలు ఒకే రకంగా ఉండే విధంగా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆయన ఆలోచన మేరకు ఒకే రకమైన కార్యాలయాలు నిర్మించినట్టు వివరించారు.