Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆపార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది
- మరోసారి అధికారంలోకి వస్తే దేశం వినాశనమే.. : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీజేపీని అధికారానికి దూరం చేస్తేనే దేశంలో లౌకిక శక్తుల పరిరక్షణ సాధ్యమవుతుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదనీ, వామపక్ష, ప్రజాతంత్ర, లౌకికవాద శక్తులు, ప్రజాతంత్ర, ప్రాంతీయ పార్టీలు ఐక్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ను నిలువరించాలని చెప్పారు. గుజరాత్‌తో పాటు త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ పలు రాష్ట్రాల్లో బీజేపీపై వ్యతిరేకత కనిపిస్తుందనీ, ప్రధాని మోడీ, అమిత్‌షాల ప్రసంగాల్లో ఆ నిరాశ, నిపృహా, ఆందోళన కనిపిస్తున్నాయన్నారు. బుధవారంనాడిక్కడి మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి డీ రాజా ముఖ్యఅతిధిగా హాజరై, మాట్లాడారు. బీజేపీ మరోసారి అధికారంలో కొనసాగితే దేశ వినాశనం తప్పదని హెచ్చరించారు. కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అందుకు భిన్నంగా నియంతత్వ ధోరణితో, నిరంకుశ విధానాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలయికను తప్పక ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనూ ఇదే రాజకీయ అవగాహనతో ముందుకు వెళ్లామన్నారు. జీవనోపాధి సమస్యలపై ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తూ, కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేయాలని తెలిపారు. అంతకుముందు జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జర్నలిస్టులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం జరుగుతుంది.