Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ సెలూన్లు, బ్యూటీపార్లర్ల పేర పెట్టుబడులు
- బతుకుదెరువుపై దెబ్బ
- పురిటి నుంచి చావు వరకు సేవ చేసే క్షౌరవృత్తిదారులు
- రిలయన్స్ పెట్టుబడుల్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
'రెక్కాడితేగానీ.. డొక్కాడని' పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న క్షౌరవృత్తిదారుల బతుకుదెరువుపై రిలయన్స్ పంజా విసరబోతోంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలనే కాకుండా చిరు వ్యాపారాలు, సేవా వృత్తుల్ని కూడా బడా సంస్థల చేతుల్లో పెట్టేందుకు సిద్దపడింది. అలా లాభసాటి వ్యాపారాలు చేసే రిలయన్స్, స్పా వంటి పెట్టుబడిదారీ సంస్థలు సేవా, సంప్రదాయ వృత్తిని కూడా వ్యాపారం చేసేందుకు సిద్దపడ్డాయి. రిలయన్స్, స్పా భారీ పెట్టుబడులు పెడితే లక్షలాది మంది క్షౌరవృత్తిదారులు వీధిన పడనున్నారు. తరాల నుంచి సంప్రదాయ వృత్తిగా కొనసాగుతున్న క్షౌర వృత్తిలో కొనసాగుతున్న క్షౌరవృత్తిదారులు కటింగ్, సేవింగ్ పనులే కాకుండా పురుడు పోయడం నుంచి చావు వరకు అనేక సేవలందిస్తున్నారు. పొద్దస్తం నిలుచుండి పని చేయడం వల్ల అనేక (మొదటిపేజీ తరువాయి)
వ్యాధులకు గురవుతూ చాలీచాలని బతుకులు వెళ్లదీస్తున్న క్షౌరవృత్తిదారుల జీవనాధారాన్ని దెబ్బతీసేందుకు బడా పెట్టుబడిదారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకుపైగా కటింగ్ షాపులున్నాయి. వీటిల్లో 5 లక్షల మంది వరకు క్షౌరవృత్తి ద్వారా ఉపాధి పొందుతున్నారు. వృత్తిదారుల కుటుంబాల్లోని 20 లక్షల మందికి పైగా క్షౌరవృత్తి జీవనాధారంగా ఉంది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే 75 వేల వరకు కటింగ్ షాపులున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 23 వేల మంది ఉన్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, పటాన్చెరు, జహీరాబాద్, నర్సాపూర్, గజ్వేల్ వంటి పట్టణాలే కాకుండా ప్రతి పల్లెల్లోనూ నాయిబ్రహ్మణులు చెట్టుకింద కుర్చీ వేసుకుని వృత్తి చేయడం మొదలుకొని సెలూన్ షాపులు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. పొద్దంతా నిలబడి కట్టింగ్, గడ్డం చేస్తే కనీస కూలీ గిట్టడంలేదు. పైగా నిలుచుండి పనిచేయడం వల్ల నరాలు బిగుసుకుపోయి తిమ్మిర్లు, చర్మ వ్యాధులు వస్తున్నాయి. కంటి చూపు దెబ్బతింటుంది. కస్టమర్ల ద్వారా టీబీ, శ్వాసకోశ, కరోనా, చర్మ, క్యాన్సర్ వంటి వ్యాధులు వ్యాపించడం వల్ల వృత్తికీ దూరమవుతున్నారు. ఉన్నట్టుండి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా బ్యూటీపార్లర్స్, సెలూన్ల పేరిట రిలయన్స్ వంటి బడా సంస్థలు పెట్టుబడులు పెట్టడం వల్ల లక్షలాది మంది వీధిన పడనున్నారు. రిలయన్స్ దుకాణాలు వస్తే క్షౌర దుకాణాలు మూతపడే ప్రమాదం ఏర్పడింది.
బ్యూటీపార్లర్లు, సెలూన్ వ్యాపారం
2009లోనే రిలయన్స్ సంస్థలు సెలూన్ వృత్తిలోకి వస్తున్నట్టు ప్రకటించాయి. అప్పట్లో నాయిబ్రహ్మణ సంఘాలు, వృత్తి సంఘాలు సమన్వయంతో పోరాడాయి. రిలయన్స్ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ఉద్యమించాయి. రిలయన్స్ రాకను వ్యతిరేకిస్తూ వామపక్షాలు, టీఆర్ఎస్ కూడా వ్యతిరేకించి వృత్తిదారులకు మద్దతిచ్చాయి. తాజాగా మళ్లీ రిలయన్స్ సంస్థ క్షౌరవృత్తిలోకి రాబోతున్నట్టు ప్రకటించి బ్యూటీపార్లర్లు, కార్పొరేట్ సెలూన్లు పెట్టి సేవా వృత్తిని వ్యాపారం చేయాలని చూస్తుంది. లక్షల పెట్టుబడులతో సెలూన్లు, బ్యూటీపార్లర్లు పెట్టడం ద్వారా చిన్న, చిన్న సెలూన్ దుకాణాల్ని దెబ్బతీయాలని చూస్తుంది. హైదరాబాద్ మహానగరంతో పాటు వరంగల్, కరీంగనర్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్నగర్, అదిలాబాద్ పాత జిల్లా కేంద్రాలే కాకుండా కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు, మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో రిలయన్స్ బ్రాంచీలు విస్తరించనున్నాయి. హంగూ ఆర్బాటాలు, ఏసీ వంటి సదుపాయాలు పెట్టి కస్టమర్లను ఆకర్షించడం ద్వారా సంప్రదాయ క్షౌరవృత్తిదారుల ఉపాధిని దెబ్బతీస్తారు. క్రమంగా సెలూన్ దుకాణంలో యజమానిగా ఉన్న వృత్తిదారుల్నే రిలయన్స్ షాపుల్లో కూలీలుగా మార్చుకునే కుట్ర జరుగుతోంది.
వేల కుటుంబాలు వీధిన పడతాయి:
రాంచందర్, సంగారెడ్డి
45 ఏండ్లుగా క్షౌరవృత్తి చేస్తున్న. మేమే కాదు మహిళలూ సేవ చేస్తారు. పొద్దస్తం నిలబడి ఉంటం. కటింగ్, గడ్డం చేసినా కూలి గిట్టుబాటు కాదు. దుకాణాల అద్దెలు, సెలూన్ వస్తువుల ధరలు బాగా పెరిగాయి. కస్టమర్లు ఇచ్చిన మేరకు డబ్బులు తీసుకుని పనిచేస్తం. ఊర్లల్లో కట్టడి పద్దతిలో ఏడాదంతా సేవ చేస్తం. పెండ్లిండ్లు, చావులు, పుట్టుకలకు కుటుం బమంతా సేవ చేస్తం. అన్ని రకాలుగా పనిచేసినా కుటుంబం గడవడం కష్టంగా ఉంది. ఉన్నంతలో బతుకుతున్న మా పొట్టగొట్టేందుకు రిలయన్స్ సంస్థ వస్తుంది. కార్పొరేటోళ్లు వస్తే మాలాంటి చిన్న దుకాణాలు మూతపడతాయి. ఇంటిళ్లిపాది వీధిన పడతాం. నిరుపేదలు, అనారోగ్యం పాలైన వాళ్లు, కురు వృద్ధులకు ఇబ్బంది కరమైనా మేం ఓపికతో వారికి గడ్డం, కటింగ్ చేస్తం. ఇచ్చింది తీసుకుంటం. రిలయన్స్ వస్తే అలాంటి వాళ్లకు ఎవరు చేయాలి.
రిలయన్స్ సంస్థను వ్యతిరేకిస్తం: ఎం.శ్రీశైలం, నాయిబ్రహ్మణ సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు
రిలయన్స్ సంస్థ క్షౌరవృత్తిని కబ్జా చేస్తే ఊరుకోం. కార్పొ రేట్ సెలూన్లు వస్తే మా జీవన వృత్తి దెబ్బతింటది. ఉన్న ట్లుండి పెట్టుబడిదారులు దుకాణాలు పెడితే మేం ఏం కావాలి. ఇప్పటికే రిలయన్స్ పెట్టుబడుల్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసినం. దుకాణాలు పెడితే వాటిని అడ్డుకుని తీరుతం. వృత్తిదారుల్ని దెబ్బ తీసేందుకు జరుగుతున్న కుట్రల్ని అన్ని వృత్తిదారులు ఐక్యంగా ఎదుర్కొవాలి. అశుభ్రంగా ఉండే అనాధలు, బుచ్చగాళ్లు, మతిస్థిమితంలేనివాళ్లు, అనారోగ్యస్తుల కు కూడా మేం కటింగ్, గడ్డం చేస్తున్నం. మా వృత్తి సేవ మాత్రమే వ్యాపారం కాదు.
కార్పొరేట్ల చేతుల్లో క్షౌరవృత్తి ప్రమాదకరం: చెన్నారం మల్లేశం, నాయిబ్రహ్మణ వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి
సంప్రదాయక సేవా వృత్తిగా ఉన్న క్షౌరవృత్తిలోకి కార్పొరేట్ సంస్థలు రావడం ప్రమాదకరం. ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోయినా సంప్రదాయకంగా క్షౌరవృత్తి ద్వారా లక్షలాది మంది ఉపాధి పొందుతూ తరాలుగా సమాజానికి సేవ చేస్తున్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో కట్టింగ్ చేయడం, గుండు, గడ్డం, పుట్టు వెంట్రుకలు గీయడం, పుణ్యక్షేత్రాల్లో తలనీలాలు తీసే పనులు చేస్తున్నారు. వైద్యం అందుబాటులో లేని కాలంలోనే మంత్రసాగి పురుడు పోసే వృత్తి నాయిబ్రహ్మణ మహిళలు చేసేది. పెళ్లిండ్లు, చావులకు కూడా సేవ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ దిష్టిబొమ్మల దగ్ధం వంటి కార్యక్రమాలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా రిలయన్స్ సంస్థ రాకుండా అడ్డుకోవాలి.