Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకొచ్చిన విధానాలతో ఎనిమిదేండ్లలో రాష్ట్రానికి రూ.7.57 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్కెఆర్ భవన్లో ఆయన పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగాల్లో జీఎస్డీపీ పెంపుదల- వ్యూహాత్మక రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల వల్ల 3.14 లక్షల మందికి అదనంగా ఉద్యోగాలొచ్చాయని చెప్పారు. ప్రయివేటు రంగంలో మరిన్ని పెట్టుబడులు, తద్వారా ఉద్యోగాల సృష్టి కోసం జీఎస్డీపీ పెంచేందుకు అధికారులు సలహాలివ్వాలని కోరారు. ఏ యే శాఖలో పెట్టుబడులకు అవకాశాలున్నాయనే దానితో పాటు, విధానాల్లో చేయాల్సిన మార్పులపై సూచనలు చేయాలన్నారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ ఎయిరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, లైప్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఇ, మైనింగ్, లాజిస్టిక్ రంగాలను ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. అదే సమయంలో ఫర్నీచర్, బొమ్మల తయారీ, డిజిటల్ వినోదం తదితర రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించిందని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.