Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-'క్యాసినో' కేసులో మంత్రి తలసాని బ్రదర్స్ విచారణ
- ఎమ్మెల్సీ ఎల్. రమణ, డీసీసీబీ చైర్మెన్ దేవేందర్ రెడ్డిలకూ నోటీసులు
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో సంచలనం రేపిన చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు సోదరులు తలసాని ధర్మేంద్ర యాదవ్, తలసాని మహేశ్ యాదవ్‌లను బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. నేపాల్,శ్రీలంకలో చికోటి ప్రవీణ్ నిర్వహించిన క్యాసినోలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణపై మంత్రి సోదరులిద్దరిని ఈడీ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. ఉదయమే ఈడీ కార్యాలయానికి చేరుకున్న ధర్మేంద్ర, మహేశ్‌లను ఈడీకి చెందిన ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ బృందం ప్రశ్నించినట్టు తెలిసింది. రాత్రి 7.30 గంటల వరకు కూడా వీరిద్దరినీ ఈడీ విచారించింది. ముఖ్యంగా, నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులను సమీకరించి చికోటి ప్రవీణ్ తరలించాడని ఈడీకి ఆధారాలు దొరికిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా హైదరాబాద్‌లోనే కోట్లాది రూపాయలను క్యాసినోలో ఆడటానికి డబ్బులను సేకరించి నేపాల్‌కు మనీ లాండరింగ్ ద్వారా చికోటి తరలించినట్టు ఈడీకి సమాచారమున్నది.
ఇందులోనే ధర్మేంద్ర, మహేశ్‌లకు కూడా సంబంధాలున్నట్టు ఈడీ విశ్వసిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని పిలిపించిన ఈడీ అధికారులు నేపాల్‌లో జరిగిన క్యాసినోతో వీరికి ఉన్న సంబంధాల గురించి ఆరా తీసినట్టు తెలిసింది. ఏ మేరకు డబ్బులు చేతులు మారాయి? ఆ డబ్బులను ఏ విధంగా నేపాల్‌కు తరలించారు? ఇందులో మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించారా? లేదా? తదితర కోణాలలో గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్టు తెలిసింది. కాగా, ఇదే క్యాసినో కేసుకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణతో పాటు డీసీసీబీ చైర్మెన్ దేవేందర్ రెడ్డిలకు కూడా ఈడీ అధికారులు నోటీసులను పంపించినట్టు సమాచారం. వీరిద్దరిని కూడా ఒకట్రెండ్రోజుల్లో పిలిచి ఈడీ అధికారులు విచారించే అవకాశమున్నదని తెలిసింది. ఒక పక్క, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరొకపక్క, శ్వేత తదితర కంపెనీల అక్రమ గ్రానైట్ ఎగుమతులకు సంబంధించి విచారణను సాగిస్తూ రాష్ట్రంలో హల్చల్ చేస్తున్న ఈడీ అధికారులు మరోసారి నేపాల్ క్యాసినో కేసుకు సంబంధించి చికోటి ప్రవీణ్ ఉదంతంపై లోతుగా దర్యాప్తును సాగిస్తున్నట్టు తెలిసింది.