Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరిస్తున్న బీజేపీ : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-కొణిజర్ల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్ల కాలంలో ప్రజలకిచ్చిన వాగ్ధానాల అమలుకు మహిళలు ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నగోపతి గ్రామంలో 'వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర-ప్రభుత్వాల వైఖరి' అంశంపై సంఘం మండల అధ్యక్షులు బొలమాల యోహన్ అధ్యక్షతన సెమినార్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెంచడంతో పేదలపై పెద్ద ఎత్తున భారం పడిందన్నారు. దేశంలో 76 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, 1.50కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉన్న దేశంలో బీజేపీ అవలంబిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలతో ఆ రంగం పూర్తిగా దెబ్బతింటుందని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో వామపక్ష పార్టీల ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేలా పని దినాలను కుదిస్తూ, బడ్జెట్లో కోత విధిస్తోందని విమర్శించారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. పార్లమెంట్లో మహిళా రక్షణ చట్టం అమలు చేసి, చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సైతం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో ఖమ్మంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడోవ మహసభలను జయప్రదం చేయాలని తెలిపారు. అనంతరం గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య వీరభద్రం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడారు. కార్యక్రమంలో వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్లపళ్లి కృష్ణ, మండల కార్యదర్శి చింతపల్లి ప్రసాద్, రైతు సంఘం జిల్లా నాయకులు చెరుకుమల్లి కుటుంబరావు, ఐద్వా నాయకులు మాచర్ల భారతి, మెరుగు రమణ, తదితరులు పాల్గొన్నారు.