Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్సీ అనుబంధ జీవోలను విడుదల చేయాలి
- ఉద్యోగులందరికీ ఆరోగ్యకార్డులివ్వాలి
- హరీశ్‌రావుకు యూఎస్పీసీ వినతి
- బదిలీలు, పదోన్నతులకు రంగంసిద్ధం చేస్తున్నాం : మంత్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బకాయి ఉన్న మూడు వాయిదాల కరువు భత్యం (డీఏ)ను వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పీఆర్సీ సిఫారసు మేరకు ఆర్పీఎస్- 2020కి అనుబంధంగా ఇవ్వాల్సిన స్పెషల్ పేలు, కన్వేయన్స్, ఏజెన్సీ అలవెన్సులు, సెలవులు తదితర అంశాలపై సవరణ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు ప్రతినెలా మొదటి తేదీన చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావును బుధవారం హైదరాబాద్‌లో యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, వై అశోక్ కుమార్, ఎం రవీందర్, టి లింగారెడ్డి, డి సైదులు, ఎన్ యాదగిరి, ఎస్ హరికృష్ణ, ఆర్ మంగ కలిసి వినతిపత్రం సమర్పించారు. ట్రెజరీల్లో పాస్ అయిన సప్లిమెంటరీ వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ రీయింబర్స్మెంట్, సెలవు వేతనాలు, జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ క్లైములు తదితర బిల్లులను టోకెన్ నెంబర్ల వారీగా జాప్యం లేకుండా చెల్లిపులు చేయాలని కోరారు. ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్ట పరచి ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ ఆరోగ్య కార్డులపై నగదురహిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూళ్లు, గురుకుల, కేజీబీవీ, యూఆర్ఎస్, ఎయిడెడ్ తదితర విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, ఉద్యోగులకు హెల్త్ కార్డులివ్వాలని సూచించారు. మెడికల్ రీయింబర్స్మెంట్ పరిమితిని కనీసం రూ.ఐదు లక్షలకు పెంచాలనీ, వాటి క్లైముల స్క్రూటినీలో, బిల్లుల మంజూరులో జాప్యాన్ని నివారించాలని కోరారు. ఇంకా ఏడేండ్లుగా నిలిచిన పదోన్నతులు, ఐదేండ్లుగా జరగని బదిలీల గురించి ప్రస్తావించి కాలపట్టికను విడుదల చేయటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 'బదిలీలు, పదోన్నతులకు రంగంసిద్ధం చేస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధించిన ఆర్థిక ఆంక్షల ఫలితంగా డీఏ ప్రకటన, జీతాల చెల్లింపు ఆలస్యవుతున్నాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగు పరచుకుని అన్ని సమస్యలనూ పరిష్కారం చేసుకుందాం. ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్యం అందరికీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఉద్యోగుల నుంచి చందా ఎంత మినహాయించాలనే అంశంపై ఏకాభిప్రాయం లేనందున చేయలేకపోతున్నాం. టీఎన్జీఓలు వేతనంలో రెండు శాతం చందా ఇస్తామంటూ రాసి ఇచ్చారు.'అంటూ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారని తెలిపారు. ఉపాధ్యాయుల అభిప్రాయం ఏంటని అడగగా యూఎస్పీసీ నాయకులు వారికి ఆమోదయోగ్యం కాదని వివరించామని పేర్కొన్నారు. ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంతకంటే చౌకగా ఆరోగ్య భీమాను అందిస్తున్నాయని తెలిపారు. సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలనీ, చందా ఎంత ఇవ్వాలో, పథకం విధివిధానాలు ఎలా ఉండాలో చర్చించి నిర్ణయంతీసుకుందామంటూ యూఎస్పీసీ నేతలు మంత్రికి స్పష్టం చేశారు.