Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటాకు రూ.1700లకే షావుకార్లు, మిల్లర్లకు ధాన్యం అమ్ముకుంటున్న కౌలు రైతులు
- మిల్లుల్లో జాగలేదు.. తేమశాతం ఇంకా రాలేదంటూ సాకులు..
- కౌలు ధ్రువీకరణ కోసం ఏఈఓల చుట్టూ తిరగలేక...
- కొనుగోలు కేంద్రాలవైపు రాని రైతులు, కౌలుదార్లు..
- వీరిబాటలోనే.. పట్టా, మ్యూటేషన్, విరాసత్లేని అన్నదాతలు
- లక్ష్యం అంచనాలో సేకరించింది 10శాతమే..
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఏడాది కౌలు రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు సిద్ధమైన సర్కారు.. పలు నిబంధనల నడుమ పంట డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అందుకు వ్యవసాయశాఖ, రైతుసమన్వయ సమితి సభ్యుల ధ్రువీకరణతో కూడిన రెండు పత్రాలు తీసుకొస్తేనే సెంటర్లలో ధాన్యం తూకం వేస్తున్నారు. ఈ తతంగానికి రోజులతరబడి సమయం పట్టడం, భూయజమానుల ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నెంబర్లు లేకపోవడం, ఉన్నా.. సమయానికి ఓటీపీ చెప్పలేని పరిస్థితుల్లో నానా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికితోడు సాదాబైనామా భూములు, పట్టాపాసుపుస్తకం లేని వారు, మ్యూటేషన్, విరాసత్కాని రైతులైతే.. అటు యజమానులు కాక, ఇటు కౌలురైతులుగా ధ్రువీకరణ తెచ్చుకోలేక 'అగ్గువకో.. సగ్గువకో..' ధాన్యాన్ని సావుకార్లకు, మిల్లర్లకే అమ్ముకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం లక్ష్యంలో కనీసం పది శాతం కూడా లేకపోవడానికి అద్దం పడుతోంది.
వానాకాలం ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఈ నెల రెండో వారం నుంచి అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకుంటూ వస్తోంది. ఇప్పటివరకు కోతలకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో అవసరం మేర సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు ఇటీవల మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్ధేశించుకున్న సెంటర్లలో సగానికిపైగా ప్రారంభించి పట్టాపాసుబుక్కు ఉన్న రైతుల నుంచే క్వింటాల్ ధాన్యానికి రూ.2060 మద్దతు ధర చెల్లిస్తూ సేకరిస్తోంది. ఏఈవోలు, రైతుసమన్వయ సమతి సభ్యులు ధ్రువీకరణతో వచ్చిన కౌలుదార్ల నుంచీ కొనుగోలు చేస్తోంది. గత సీజన్ వడ్లతో నిండిపోయిన మిల్లుల్లో జాగ లేదని, తేమ శాతం ఇంకా రాలేదని కొర్రీలు పెడుతున్న సెంటర్లలో ధాన్యం సేకరణ నత్తనకడన సాగుతోంది. దీంతో రోజుల తరబడి కేంద్రాల్లో పడిగాపులు కాయలేని రైతులు, కౌలుదార్లు తూకంలో కోతలు, తేమశాతం లెక్కల్లేకుండానే క్వింటా ధాన్యాన్ని (రకం, నాణ్యతనుబట్టి) రూ.1650 నుంచి రూ.1800లోపే మిల్లర్లకు అమ్ముకుంటున్నారు.
కౌలు రైతుకు వచ్చిన పెద్దకష్టం
గతేడాది వరకూ ధాన్యం సేకరణలో కౌలు రైతులను లెక్కలోకే తీసుకోలేదు. భూమి విస్తీర్ణం, పట్టాపాస్‌బుక్కు, ఆ భూయజమాని ఆధార్, ఖాతా నెంబర్లను తీసుకునే కౌలురైతులు తెచ్చిన ధాన్యాన్ని తూకం వేసి డబ్బులు యజమాని ఖాతాల్లోనే జమ చేశారు. ఇందులో రైతుల మధ్య గొడవలు రావడం, యజమాని అందుబాటులో ఉండకపోవడంతో కొంత నిబంధనల నడుమ కౌలురైతు ఖాతాలో డబ్బులు వేసేందుకు ఈ ఏడాది ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది.
ఇందుకు ఫారం-1, 2 పత్రాలలో వ్యవసాయాధికారులు, రైతు సమన్వయసమితి సభ్యుడు యజమాని భూసర్వేనెంబర్, విస్తీర్ణం లెక్కలు తీసి, అది కౌలు తీసుకున్న రైతు పేరును నమోదు చేసి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయితే సదరు భూయజమాని ఆధార్‌తో లింక్ అయిన ఫోన్‌నెంబర్‌కు వెళ్లిన ఓటీపీని నమోదు చేయాల్సి ఉంది. ఇక్కడే కొన్ని చోట్ల యజమానులు అందుబాటులో ఉండకపోవడం, నిమిషం వ్యవధిలోనే సదరు యజమాని ఓటీపీ చెప్పడం వంటి ప్రక్రియ రోజులతరబడి సమయాన్ని వృథా చేస్తోంది. దాంతో సెంటర్లలో ధాన్యం అమ్ముకునే బదులు క్వింటా రూ.1800 అయినా మిలర్లలకే అమ్ముకుంటున్నారు.
పట్టా, మ్యూటేషన్, విరాసత్ లేకుంటే అంతే..!
ధరణి పోర్టల్ వచ్చిన తరువాత అంతకు ముందు సాదాబైనామాల ద్వారా క్రయవిక్రయాలు జరిగిన వ్యవసాయ భూముల వివరాలు చాలా వరకు వ్యవసాయశాఖ రికార్డుల్లో నమోదు కాలేదు. రైతుబంధు దరఖాస్తు చేసుకునే వీలు లేకపోవడంతోపాటు ఇతర కారణాల వల్ల మ్యూటేషన్, విరాసత్ అయిన భూములూ రికార్డుల్లో లేవు. సదరు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తమ ఆధార్ నెంబర్ ఇస్తే.. కేవలం రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న భూముల వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దాంతో వారు పండించిన ధాన్యం సేకరించేందుకు వీలులేకుండా పోయింది. వీరంతా పడావుగా ఉన్న భూముల యజమానుల పట్టాదారుపాసుపుస్తకాలు తెచ్చుకుని కొందరు అతికష్టంమీద పంటను అమ్ముకుంటున్నారు. ఈ వ్యయప్రయాసాలెందుకని మిల్లర్లకే తక్కువకు అమ్ముకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో అనేక మంది కౌలుదారులు మిల్లులకు అమ్ముకుంటున్నారు. క్వింటాకు 5 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. ఎన్నెస్పీ ఆయకట్టు పరిధిలోని 30వేలకు పైగా ఉన్న కౌలుదారులందరూ ఇలాగే నష్టపోతున్నారు.
వచ్చినకాడికి సాలనే..!
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేస్తలేరు. తేమ రాలేదని, మిల్లుకాడ జాగలేదని చెబుతున్నరు. తూకం వేసినా కోత పెడుతామంటున్నరు. ఇన్ని కష్టాలు పడుడెందుకని వచ్చినకాడికి సాలని క్వింటాల్ రూ.1680 చొప్పున మిల్లోల్లకే అమ్మిన
- రాజన్న, మానకొండూర్, కరీంనగర్ జిల్లా
కౌలుపత్రాలు తేలేకనే..
ఇద్దరి దగ్గర 7 ఎకరాలు కౌలుకు తీసుకున్న. అండ్ల పండిన వడ్లను అమ్మేందుకు సార్ల దగ్గర సంతకాలు తెమ్మన్నరు. వాళ్లు దొరుకతలేరు. ఈ లొల్లంతా ఎందుకని సావుకారికే 300 బస్తాలు అమ్మిన. క్వింటల్ వడ్లకు రూ.1900 కట్టి ఇచ్చిండు.
- తిరుపతి, లలితపల్లె, ఎలిగేడు మండలం, పెద్దపల్లి జిల్లా
పక్కాలెక్కల కోసమే ని'బంధనాలు'...
రైతుకు ఎంత భూమి ఉంటే దానికి అనుగుణంగానే ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. గరిష్టంగా ఎకరానికి 36 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని లెక్కలు వేసింది. రైతులు తెచ్చిన పట్టాదారు పాస్‌బుక్‌లో ఉన్న భూమికి, కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యానికి లెక్క కుదిరితేనే సేకరిస్తోంది. ఇందుకు అనేక కారణాలు చెబుతోంది. అటు మహారాష్ట్ర, ఇటు చత్తీస్గడ్ ప్రాంతాల నుంచి అక్రమంగా వచ్చే ధాన్యాన్ని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది. అయితే ఈ ని'బంధనాలు' ఇక్కడి కౌలుదార్లకు, భూయాజమాన్య పత్రాలులేని రైతులకు మోకాలడ్డుతోంది.