Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరంతరం నిర్వహణ పనులు చేపట్టండి...
- వారంలోగా టెండర్లు పిలవండి :ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలకు సీఎం ఆదేశాలు
- రోడ్లు అద్దాల మాదిరిగా మెరవాలంటూ సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రోడ్లు, భవనాలు.. పంచాయతీరాజ్ శాఖల పరిధిలో క్షేత్రస్థాయిలో పనులను మరింత పటిష్టపరిచాలని సీఎం కేసీఆర్ ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుకనుగుణంగా నియామకాలు తదితర అభివృద్ధి కార్యాచరణపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎం అధ్యక్షతన ఆయా శాఖలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...స్వరాష్ట్రంలో పటిష్టంగా తయారు చేసుకున్న రోడ్లలో రవాణా ఒత్తిడి వల్ల, కాలానుగుణంగా మరమ్మతులు చోటు చేసుకుంటాయని తెలిపారు. వాటిలో గుంతలు లేకుండా చూడాలని కోరారు. సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలుగా నిరంతరం నిర్వహణ పనులను చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పెరిగిన వనరులతో, స్వయం ఉత్పాదక శక్తితో, అభివృద్ధి పనుల పరిమాణం రోజు రోజుకూ పెరుగుతున్నదని అన్నారు. ఈ గుణాత్మక ప్రగతికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కావాల్సినంత సిబ్బందిని నియమించుకుని, బాధ్యతల వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.
'సాంప్రదాయ పద్దతిలో కాకుండా చైతన్యవంతంగా విభిన్నంగా ఇంజనీర్లు ఆలోచన చేయాలె. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, వానలు, వరదలకు పాడైన రోడ్లను మరమ్మత్తులు చేయాలె. చెక్కు చెదరకుండా అద్దాల మాదిరిగా రోడ్లను ఉంచేందుకు నిరంతర నిర్వహణ చేపట్టాల్సిన బాద్యత ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్ శాఖలదే. ఈ దిశగా మీమీ శాఖల్లో పరిపాలన సంస్కరణలు అమలు చేయాలె. క్షేత్రస్థాయిలో మరింతమంది ఇంజనీర్లను నియమించుకోవాలె...' అని సీఎం సూచించారు. ఇతర శాఖల మాదిరే ఆర్ అండ్ బీ శాఖకు కూడా ఈఎన్సీ అధికారుల విధానం అమలు చేయాలన్నారు. ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎస్ఈ ఉండే విధంగా, టెర్రిటోరియల్ సీఈలను కూడా నియమించాలన్నారు. పటిష్టంగా పనులు జరగాలంటే ఎస్ఈల సంఖ్య, ఈఈల సంఖ్య ఎంత ఉండాలనే దానిపై ఆలోచన చేయాలన్నారు. శాఖలో పెరుగుతున్న పనిని అనుసరించి ప్రతిభావంతంగా పర్యవేక్షణ చేసే దిశగా పని విభజన చేసుకోవాలని సూచించారు. ఈ అంశంపై అధికారులు సమీక్షించుకుని ప్రభుత్వానికి తుది నివేదికను అందజేస్తే రాబోయే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశమున్నదని సీఎం అన్నారు. రోడ్ల మరమ్మతులకోసం టెండర్లు పిలిచి వారంలోగా కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన కార్యాచరణపై తక్షణమే దృష్టి సారించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో కేజీ వీల్స్‌తో ట్రాక్టర్లను నడిపడం ద్వారా రోడ్లు పాడవుతున్న విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా కేసీఆర్ దృష్టికి తెచ్చారు. ఈ దిశగా రైతులు, ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లను చైతన్యపరచాలనీ, ఇందుకు సంబంధించి కఠిన నిబంధనలు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సూపర్ స్పెషాలిటీల్లో ప్రత్యేక విభాగాలు...
రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను పటిష్ఠంగా నిర్మించాలని సీఎం ఆదేశించారు. దవాఖానాల నిర్మాణ నమూనాలను ఆయన గురువారం పరిశీలించారు.ప్రజల సౌకర్యార్దం వరంగల్, హైద్రాబాద్‌లో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాలో ఈఎన్టీ, డెంటల్ ఆప్తమాలజీ, విభాగాలకోసం ఒక ఫ్లోర్‌ను కేటాయించాలని సూచించారు.