Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుట్టుచప్పుడు కాకుండా అటవీ ప్రాంతంలో తవ్వకాలు
- పురాతన ఆలయాలు నిర్మాణాలే లక్ష్యంగా విధ్వంసాలు
- అటవీ అధికారులది ప్రేక్షక పాత్ర
నవ తెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
నల్లమల అటవీ ప్రాంతంలో గుప్తనిధుల వేట గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోంది. భారీ నిర్మాణాలు, పురాతన కట్టడాలు, దేవాలయాలే లక్ష్యంగా తవ్వకాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. నల్లమల అటవీ ప్రాంతం అటవీ సంపదకే కాకుండా అపారమైన నిధి నిక్షేపాలకు క్షేత్రమని చెబుతూ ఉంటారు. ల్లమల అటవీ ప్రాంతంలో పురాతన కాలంలో ఉమామహేశ్వరం, సలేశ్వరం, లొద్ది మల్లెల తీర్థం వంటి దేవాలయాలు వెలిశాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన ప్రతాపరుద్రుని కోట సైతం నల్లమలలోనే ఉంది. కాకతీయ రాజుల పరిపాలన కాలంలో ఈ ప్రాంతంలో అనేక శివాలయాలు, ఇతర ఆలయాలను నిర్మించినట్టు చారిత్రక ఆనవాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయాలు నిర్మాణం చేపడుతున్న క్రమంలో పరిసర ప్రాంతాల్లో నిధులను ఉంచి కట్టడాలు చేపట్టారని కథలుగా చెప్పుకుంటారు. వీటిలో వాస్తవ అవాస్తవాలు ఎలా ఉన్నా.. విధ్వంసకారులు, మాఫియా తవ్వకాలకు పాల్పడుతున్నారు. ఈ తవ్వకాల్లో చాలావరకు పురాతన విగ్రహాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో ఆయా విగ్రహాలు ధ్వంసం కావడం, ఆలయ గోడలు, పునాదులు దెబ్బతిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి.
కలకలం రేపుతున్న గుప్తనిధుల వేట
నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్ మండలాల్లోని అడవుల్లో నిత్యం గుప్త నిధుల తవ్వకాలు జరుగుతుండటం కలకలం రేగుతుంది. ఇటీవల అమ్రాబాద్ మండలంలోని ప్రతాపరుద్రుని కోట సరిహద్దుల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. శ్రీశైలం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రతాపరెడ్డి కోట వద్ద ఐదుగురు వ్యక్తులు తవ్వకాలకు ప్రయత్నించారు. ఈ కోటకు వెళ్లే మార్గంలో అటవీశాఖ అధికారులు గేటును సైతం ఏర్పాటు చేశారు. అనుమతి లేనిదే ఈ మార్గం నుంచి లోనికి ప్రవేశించకూడదని నిబంధనలు విధించారు. అయినా పోలీసులు, అటవీశాఖ అధికారుల కళ్లుగప్పి రెండు బైకులపై వెళ్లి తవ్వకాలు జరిపేందుకు యత్నించారు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అమ్రాబాద్ మండలాలకు చెందిన రామచంద్రయ్యతో పాటు వంగరోనిపల్లికి చెందిన రామాంజనేయులు, దేవరకొండకు చెందిన చంద్రయ్య, భుత్పూర్కు చెందిన కృష్ణయ్య, మహబూబ్‌నగర్‌కు చెందిన చంద్రమౌళిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. శ్రీశైలం క్షేత్రానికి ఉత్తర ద్వారంగా ఉన్న ఉమామహేశ్వరం, మద్దిమడుగు, మల్లెల తీర్థం, లొద్ది మల్లయ్య, అస్సాపూర్, బౌరపురం వద్ద బ్రమ రాంబ అమ్మవారి ఆలయాలు ప్రధానమైనవి. ఈ ఆల యంతో పాటు నల్లమలలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో కూడా గతంలో తవ్వకాలు జరిగినట్టుగా తెలుస్తుంది.
తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు
అధికారులు అందించిన లెక్కల ప్రకారం.. 2018 ఆగస్టు 10న రాయల గండి వద్ద ఆలయ సమీపంలో గుప్త నిధుల కోసం అన్వేషిస్తున్న పలువురిని స్థానికులు పట్టుకున్నారు. 2019 నవంబర్ 20న పదర మండలంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్న అగ్నిగుండంలో తవ్వకాలు జరిపారు. 2020 ఫిబ్రవరి 11న అమ్రాబాద్ టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ పరిధిలోని బౌరపురం భ్రమరాంబిక ఆలయంలో తవ్వకాలు జరిగాయి. 2021 అక్టోబర్‌లో లక్ష్మీ చెన్నకేశవుల ఆలయంలో తవ్వకాలు జరిపారు. ఇలా ప్రతి ఏడాదీ నల్లమల అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే గతేడాది అమ్రాబాద్ మండలంలోని రాయల గడిలో వెలసిన లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చోటుచేసుకున్నాయి. అమ్రాబాద్, పదర ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఆలయ ప్రాంగణం భాగంలో ఉన్న పురాతన రాతి శిలను డ్రిల్లింగ్ చేసి శిల్పంలోని పద్మాన్ని ఎత్తుకెళ్లారు. రెండేండ్ల కిందట ఇదే ఆలయంలో తవ్వకాలకు ప్రయత్నించారు. పారిపోతున్న దుండగులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ పోలీసులు అటవీశాఖ అధికారులు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయారని పలువురు ఆరోపిస్తున్నారు.
పురాతన కట్టడాలు కాపాడుకోవాలి
ఉమ్మడి మహబూబ్‌నగర్ నగర్ జిల్లాలో పురాతన కాలంలో వందలాది నిర్మాణాలన్నాయి. పాన్‌గల్ వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, ఖిలాఘనపూర్ వంటి ప్రాంతాల్లో కోటల నిర్మాణాలున్నాయి. నేడు ఇవి పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ముఖ్యంగా రాజుల నాటి కాలంలో నిర్మించిన ప్రతాపరుద్రుని కోట ప్రాంతాన్ని టూరిజంగా మారుస్తామన్న పాలకులు.. ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం టూరిజం ఏర్పాటుకు కృషి చేయాలని పలువురు కోరారు.