Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీడిమెట్లకు 8, ఫత్తుల్లాగూడకు 7, శాతాంరాయికు 8, తూమ్కుంటకు ఏడు సర్కిళ్లు
- వ్యర్థాల సేకరణకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్లు
- ఇక ఇబ్బందులుండవు : మేయర్
నిరంజన్: భవన నిర్మాణ, కూల్చివేసిన వ్యర్థాలను రోడ్డుపైన, నాలాలో, ఫుట్‌పాత్, చెరువుల్లో, అనుమతిలేని ప్రదేశాల్లో వేయడంతో ప్రజలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణ వ్యర్థాలను సేకరించడానికి జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నిర్మాణ వ్యర్థాలు ఎప్పటికప్పుడు తరలించేందుకు ప్రయివేటు భాగస్వామ్యంతో మరో రెండు సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకున్నది. ఒక ప్లాంట్ సికింద్రాబాద్ జోన్ శామీర్‌పేట మండలం తూముకుంట గ్రామంలో, మరొకటి చార్మినార్ జోన్ శంషాబాద్ షాతంరాయి గ్రామంలో ఏర్పాటు చేశారు. గతంలో జీడిమెట్ల, ఫతుళ్లగూడ ప్లాంట్లు కూడా ముందుగా సేకరణ చేసి ప్లాంట్ వరకు తరలించి నిల్వ చేసుకునే వారు. ఆ తర్వాత పూర్తిగా ప్లాంట్ల నిర్మాణం చేపట్టి రీసైక్లింగ్ చర్యలు ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాంట్లు సైతం అదే తరహాలో వ్యర్థాలు సేకరణ చేసుకుని ఆ తర్వాత రీసైక్లింగ్ చర్యలు చేపట్టనున్నారు. ఈ ఒక్కొక్క ప్లాంట్ రోజుకి 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న వ్యర్థాలను రీసైక్లింగ్ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
నగరానికి నాలుగువైపులా..
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇక నుంచి 2 వేల మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ రోజు వారీగా చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరం నలువైపులా 4 ప్లాంట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకున్నది. ముందుగా రెండు సీ అండ్ డీ ప్లాంట్లను జీడిమెట్ల, ఫతుల్లగూడలో ఒక్కొక్కటి 500 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఏర్పాటు చేశారు.
నిర్మాణ వ్యర్థాలు తరలించేందుకు సర్కిల్‌వారీగా సీఅండ్‌డీ 4 ప్లాంట్లు ఒక్కొక్క ఏజెన్సీ రెండేసి ప్లాంట్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒక ఏజెన్సీకి 15 సర్కిళ్లు మరొక ఏజెన్సీకి మరో 15 సర్కిళ్లను కేటాయించారు. ఈ ఏజెన్సీ ప్రయివేటు వ్యక్తుల వ్యర్థాలను తరలించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. అవసరమైనవారు టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదిస్తే ఇంటి వద్దకే వచ్చి అట్టి వ్యర్థాలను తీసుకెళ్తారు. అందుకు కలెక్షన్, రవాణా, ప్రాసెసింగ్ చార్జీలు.. జీహెచ్ఎంసీ నిర్దేశించిన ప్రకారంగా టన్నుకు వసూలు చేస్తారు. ఫతుల్లాగూడ, జీడిమెట్ల కలెక్షన్ ఏరి యాకు ఒకే టోల్ ఫ్రీ నెంబర్ 18001201159, తూము కుంట, షాతం రాయి కలెక్షన్ ఏరియాకు టోల్ ఫ్రీ నెంబర్ 18002030033కు సంప్రదించాలని అధికారులు సూచించారు.
సర్కిళ్ల కేటాయింపు
జీడిమెట్ల కలెక్షన్ ఏరియాకు 8 సర్కిళ్లను కేటా యించారు. వాటిలో యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందా నగర్, ఆర్సీపురం, పటాన్చెరు, మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం ఉన్నాయి. ఈ సర్కిళ్లవారు టోల్ ఫ్రీ నెంబర్ 18001201159ను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు. ఫతుల్లాగూడ కలెక్షన్ ఏరియాకు ఏడు సర్కిళ్లను కేటాయించారు. వాటిలో ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, మలక్‌పేట్, సంతోష్‌నగర్, అంబర్పేట్ ఉన్నాయి. వీరు టోల్ ఫ్రీ నెంబర్ 18001201159 అధికారులు కోరుతున్నారు. షాతంరాయి విలేజ్ శంషాబాద్ కలెక్షన్స్ ఏరియా కేటాయించిన వాటిలో చాంద్రాయణగుట్ట, చార్మి నార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్ ఉన్నాయి. సంబంధిత సర్కిళ్ల ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 18002030033ను సంప్రదిం చాలని అధికారులు సూచించారు. శామీర్‌పేట్ మండలం తూముకుంట కలెక్షన్ ఏరియాలో ఏడు సర్కిళ్లు ఉన్నాయి. కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, బేగంపేట్ సర్కిళ్లకు చెందిన ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 18002030033ను సంప్రదించాలని తెలిపారు.
ఇక ఇబ్బందులు ఉండవు
నగరంలో నిర్మాణ వ్యర్థాల వల్ల ప్రజలు ఇబ్బందిని గమనించి ఉత్తరం, దక్షిణం వైపు ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. ఇంతకు ముందు ఫతుల్లాగూడ, జీడిమెట్ల ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. వీటి వలన 15 సర్కిళ్లలో మాత్రమే సేకరించేవారు. మరో 15 సర్కిళ్లలో వ్యర్థాల సేకరణను చార్మినార్, సికింద్రాబాద్ వైపు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. నగరంలో నిర్మాణ వ్యర్థాలను ప్రజలు నాలాలో వేయడం మూలంగా మురుగు నీరు నిలిచిపోయి లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లి నివాసితులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం.
- మేయర్ గద్వాల్ విజయలక్ష్మి