Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రైవర్, కండక్టర్లు అలాగే రిటైర్ కావాలా?
- యాజమాన్యానికి ఎన్‌ఎమ్‌యూ ప్రశ్న
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముఫ్ఫై ఏండ్లు డ్యూటీ చేసినా డ్రైవర్, కండక్టర్లు అవే ఉద్యోగాల్లో రిటైర్ అవుతున్నారనీ, వారికి ప్రమోషన్లు ఎందుకు ఇవ్వట్లేదని టీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎమ్‌యూ) అధ్యక్షులు పీ కమాల్‌రెడ్డి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా వారిపట్ల యాజమాన్యం చూపుతున్న వివక్షే అని గురువారంనాడొక పత్రికా ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఆర్టీసీ అధికారులకు చాలా ఎక్కువ జీతాలు ఉన్నాయనీ, వారికి మాత్రం అన్ని విభాగాల్లో పదోన్నతులు లభిస్తున్నాయని తెలిపారు. కానీ సంస్థలోని కార్మికులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగుల కంటే అతి తక్కువగా జీతాలు ఉన్నాయనీ, 30 ఏండ్లు ఎదురు చూసినా వారికి మాత్రం పదోన్నతులు లభించట్లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక దాదాపు 120 మందికి పైగా డిపో మేనేజర్లు, 30 మందికి డివిజనల్ మేనేజర్లు, 20 మందికి రీజనల్ మేనేజర్లు, 10 మందికి పైగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అధికారులకు ప్రమోషన్లు ఇచ్చారని వివరించారు. టీఎస్ ఆర్టీసీ చైర్మెన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్‌డీగా వీసీ సజ్జన్నార్ నియమితు లయ్యాక గడచిన ఏడాది కాలంలో మరికొందరు అధికారులకు ప్రమోషన్లు ఇచ్చారని ప్రస్తావించారు.
క్లాస్-2 సూపర్వైజర్ల నుంచి క్లాస్ -1 అధికారుల వరకు ఖాళీ ఏర్పడగానే పదోన్నతులతో వెంటనే భర్తీ చేస్తున్నారనీ, కానీ డ్రైవర్, కండక్టర్లు అదే పోస్టులో రిటైర్ అవుతున్నారని తెలిపారు. దీనిపై యాజమాన్యం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సంస్థ చైర్మెన్, ఎమ్డీలకు లేఖలు రాస్తున్నామని చెప్పారు.