Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూరీ, చార్మీలను ప్రశ్నించిన ఈడీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఇటీవల విడుదలైన లైగర్ సినిమాలో పెట్టుబడులపై ప్రముఖ దర్శక, నిర్మాత పూరీ జగన్నాథ్, నటి చార్మిలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం విచారించారు. వీరిద్దరిని తమ కార్యాలయానికి పిలిపించి 13 గంటల పాటు విచారణ జరిపినట్టు సమాచారం. భారీ బడ్జెట్తో నిర్మితమైన లైగర్ సినిమాలో పలువురు ప్రముఖులు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారని ఈడీకి సమాచారమున్నది. అంతేగాక, మరికొందరు విదేశాల నుంచి కూడా ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టారని దర్యాప్తు సంస్థ దృష్టికి వచ్చింది. దీంతో 15 రోజుల క్రితం పూరీ జగన్నాథ్, చార్మీలకు నోటీసులిచ్చి విచారణకు గురువారం హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు ఉదయం 8.30 గంటలకే మూడో కంటికి కనిపించకుండా పూరీ, చార్మీలు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు 9.30 గంటల ప్రాంతం నుంచి రాత్రి 8.45 వరకు వీరిద్దరిని ఈడీ అధికారులు విచారించారు. వారు తెచ్చుకున్న బ్యాంకు అకౌంటు పత్రాలను, తాము ఇది వరకే సేకరించిన సమాచారాన్ని వారి ఇద్దరి ఎదుట పెట్టి ఈడీ అధికారులు విచారించారని తెలిసింది.
ముఖ్యంగా, చార్మీ ఖాతాలోకి భారీ ఎత్తున విదేశీ నిధులు రావటం, చార్మీ నిర్వహిస్తున్న నిర్మాణ సంస్థ అకౌంట్లలోకి కూడా అనేక మంది ప్రముఖుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ కావటం గురించి ఈడీ అధికారులు ప్రశ్నించారని సమాచారం. ఈ సందర్భంగా వీరి అకౌంట్లలోకి డబ్బులు చేరిన వైనంలో మనీలాండరింగ్ చోటు చేసుకున్నట్టు, అలాగే పీఎంఎల్ఏ ఉల్లంఘన జరిగినట్టు కూడా ఈడీ అధికారులు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో డ్రగ్స్ కేసులో పూరీ, చార్మీలను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా లైగర్ సినిమా నిర్మాణం కోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టటం, ఈ పెట్టుబడులు పెట్టినవారిలో కొందరు ప్రముఖులతో పాటు మరికొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పూరీ, చార్మిలను విచారించిన ఈడీ అధికారులు వీరి సినిమాలో పెట్టుబడులు పెట్టినవారిని కూడా విచారించే అవకాశమున్నట్టు తెలిసింది.