Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనుల పర్యవేక్షణ కోసం అధికారులకు ట్యాబులు : మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూముల సర్వేను పారదర్శకంగా త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని డీఎస్ఎస్ భవన్లో ఐటీడీఏ పీఓలతో ఆమె సమీక్ష నిర్వహించారు. గిరిజన సంక్షేమానికి సంబంధించి క్షేత్రస్థాయిలో మరింత మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు కృషి చేయాలన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి,పోడు భూముల సర్వే కార్యక్రమాలను పరిశీలించేందుకు అధికారులకు ట్యాబులు అందజేస్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే గ్రామసభ, డివిజన్ సభ, జిల్లా సభలను పూర్తి చేయాలన్నారు.. అన్ని అర్హతలు ఉన్న పోడు భూముల పట్టాలను లబ్దిదారులకు వచ్చే నెల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశారు.తక్షణం గ్రామ, డివిజన్, జిల్లా సభలను పూర్తిచేయాలన్నారు.
విజ్ఞాపనల వెరిఫికేషన్, సర్వే లను వెంటనే పూర్తి చేయడానికి వీలుగా అదనపు బందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగొధ్దని మంత్రి స్పష్టం చేశారు. రెవిన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్రంలో అడవులను సంరక్షించాలనే ప్రభుత్వ ధ్యేయానికి అనుగుణంగా కృషి చేయాలని కోరారు. మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియను ఒక టీమ్ వర్క్ తో పూర్తిచేయాలని సూచించారు. పోడు భూముల సర్వేతో పాటు గ్రామీణ రోడ్ల మరమ్మత్తుల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గిరి వికాస్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. సమీక్ష సమావేశంలో, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, ట్రైకార్ మేనేజర్ శంకర్ రావు, ఉట్నూరు పీవో వరుణ్ రెడ్డి, భద్రాచలం పీఓ గౌతమ్ పోట్రూ ఏటూరు నాగారం పీఓ అంకిత్, మన్ననూర్ పీఓ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.