Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రారంభంలోనే రోగాలను గుర్తించగలిగితే సాధారణ చికిత్సతోనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారవచ్చని అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌పీఐ) డాక్టర్ గిరిజన రమణి తెలిపారు. ఏఎఫ్‌పీఐ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ మల్లాపూర్‌లోని శ్రీకరి మహాసన హైస్కూల్లో నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించారు. బరువు, ఎత్తుతోపాటు దంత, కంటి, చెవి, ముక్కు, గొంతు, చర్మానికి సంబంధించిన వ్యాధి నిర్దారణ పరీక్షలను నిర్వహించారు. దాదాపు 10 నుంచి 11 రకాల జబ్బులతో కొంత మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించారు. చదవడం, రాయడంలో కష్టం, దృష్టి లోపం, అధిక బరువు, ఆహారలోపాలు, విటమిన్లు, పంటి సమస్యలు, బొల్లి సంబంధిత తెల్లమచ్చలు, చర్మ సంబంధిత వ్యాధులు, ఫంగస్ వల్ల సంభవించే పేను కొరుకుడు వ్యాధి, వయసుకి తగ్గ ఎత్తు లేకపోవడం, ఎండోక్రయిన్ వ్యాధులు, విటమిన్ డి లోపం వల్ల వచ్చే రికెట్స్ వ్యాధి, విటమిన్ల లోపం వల్ల ముఖం మీద తెల్లమచ్చలు, ఎండ వల్ల ఏర్పడే తెల్లమచ్చలు, మోకాలికి చీము పట్టి ప్రమాదకరంగా మారడం, ఎముక దెబ్బతినే పరిస్థితి రావడం వ్యాధులు ప్రాథమిక దశలో ఉన్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా ప్రముఖ పీడీయాట్రిషియన్ డాక్టర్ నళిని మాట్లాడుతూ మందకొడితనం, రక్తహీనత వల్ల గుండె వేగంగా కొట్టుకోవడాన్ని కూడా గుర్తించినట్టు తెలిపారు. ఈ వ్యాధుల చికిత్స గురించి తల్లిదండ్రులతో చర్చించి, అవసరమైతే స్పెషలిస్టు వైద్యం అందేలా చూడటం వల్ల కూడా పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి పిల్లల్లో వ్యాధులను ప్రారంభదశలోనే గుర్తించడం ద్వారా పాఠశాల యాజమాన్యం మంచి నిర్ణయం తీసుకుందని తల్లిదండ్రులు ఆ పాఠశాల చైర్మెన్ ఎన్.సాయిబాబాకు ధన్యవాదాలు తెలిపారు. పరీక్షలు నిర్వహించిన వారిలో ప్యామిలీ ఫిజీషియన్లు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సరిత, డాక్టర్ వర్థన్, ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాల నుచి జచిన్ బృందంతో పాటు డెంటల్, ఇంప్లాంట్ సర్జన్లు డాక్టర్ వేణు యాదవ్, డాక్టర్ రాజా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాల షినాయ్ పర్కాల్ తదితరులు పాల్గొన్నారు.