Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పోస్టుల అప్గ్రేడ్కున్న అడ్డంకులను తొలగిస్తాం
- ఆర్‌యూపీపీటీఎస్ నేతలకు మంత్రి సబిత హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని భాషాపండితుల పోస్టులను అప్‌గ్రేడ్ చేసేందుకు ఉన్న అడ్డంకులను తొలగించి త్వరలోనే వారికి తీపికబురు అందిస్తామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రిని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్‌యూపీపీ) తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు సి జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సిములు కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో దశాబ్ధాలుగా భాషా పండితులు ఎదురుచూస్తున్న గ్రేడ్-2 పోస్టుల అప్‌గ్రెడేషన్ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వీసు రూల్స్ 2,3 ఇచ్చిందని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఆ తర్వాత 110 జీవోను ఇచ్చి మరింత దూకుడు పెంచిందని పేర్కొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భాషా బోధకులను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు మంత్రి సబిత వివరించారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు అనుగుణంగా రాష్ట్రంలో భాషా పండితుల పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని మరోసారి సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌యూపీపీటీఎస్ హైదరాబాద్ జిల్లా బాధ్యులు నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.