Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంగులతో చర్చించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మా జోతిరావు ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పనివేళలను ఇతర సంక్షేమ గురుకుల విద్యాసంస్థలతో సమానంగా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మార్చేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అంగీకరించారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రిని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి కలిసి పనివేళల మార్పు, దసరా సెలవుల్లో అతిథి ఉపాధ్యాయుల (గెస్ట్ టీచర్ల) వేతనాల్లో కోత వంటి అంశాలపై చర్చించారు. పాఠశాలల్లో పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఉపాధ్యాయుల ఆందోళనను మంత్రి దృష్టికి వారు తీసుకొచ్చారు. ఈ అంశాలపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ అన్ని సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులకు ఒకే రకమైన సదుపాయాలు, ఉపాధ్యాయులకు ఒకే విధమైన వేతనాలు అమలు చేస్తున్నామనీ, పాఠశాలల పనివేళలు కూడా ఒకే విధంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అతిథి ఉపాధ్యాయులు కూడా తెలంగాణ బిడ్డలే కనుక మానవతా దృక్పథంతో దసరా సెలవుల పేరుతో కోత విధించిన వేతనం తిరిగి చెల్లించే ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లోని సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి కమలాకర్‌కు నర్సిరెడ్డి, జంగయ్య, చావ రవి కృతజ్ఞతలు తెలిపారు.