Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో కుట్టుశిక్షణ, మిషన్లు ఇప్పిస్తాం
- కొత్త పద్ధతులు, మెలుకువలు నేర్చుకోవడానికి సరస్ మంచి వేదిక
- సరస్ ఫెయిర్ 2022 ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- నెక్లెస్‌రోడ్డులో 28 వరకు ఫెయిర్ కొనసాగింపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ ప్రాంత మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌లో మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ ఇప్పించామనీ, అక్కడి టెక్స్టైల్ పార్కులో కొందరికి ఉద్యోగావకాశాలు కూడా కల్పించామని తెలిపారు. దీన్ని రాష్ట్రమంతటా విస్తరించి కుట్టు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. రూ.10 వేల విలువైన కుట్టుమిషన్ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. మహిళలు సొంత కాళ్లపై ఎదిగేందుకు ఆ శిక్షణ ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ మహిళల హస్తకళా వస్తువుల ప్రదర్శన (సరస్ ఫెయిర్)2022ను జ్యోతిప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఈ ఏడాది 18 వేల కోట్ల బ్యాంక్ రుణాలు ఇప్పించాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. దీనికి సహకరిస్తున్న బ్యాంకర్లకు ధన్యవాదాలు తెలిపారు. మహిళలకు ఆదాయాన్ని పెంపొందించడానికి, కుట్టు, అల్లికలు, బ్యాగుల తయారీ, చేతివృత్తులు మొదలైన వాటిలో నైపుణ్య శిక్షణలు ఇప్పిస్తున్నామన్నారు. గ్రామీణ మహిళా ఔత్సాహికులను గుర్తించి, వారికి వివిధ రంగాలలో ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేసి, అధిక మొత్తంలో రుణాలిప్పించడంలో సహకరిస్తున్నామన్నారు. దీని వల్ల మహిళలే నలుగురైదుగురికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో గ్రామీణ మహిళలు కల్తీ లేకుండా తయారు చేస్తున్న పసుపు పొడి, మిరప పొడి, పచ్చళ్ల నాణ్యతపై ప్రజలలో చాలా నమ్మకం ఏర్పడిందన్నారు. మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రతి ఏటా ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. అయితే, వీటిని జిల్లాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మరోవైపు ఉత్పత్తుల అమ్మకాల కోసం ఆన్లైన్ సంస్థలతోనూ సెర్ప్ ఒప్పందం చేసుకుంటున్నదని తెలిపారు. సరస్ ఫెయిర్‌లో 22 రాష్ట్రాల నుంచి 300 మంది గ్రామీణ మహిళలు తమ చేతివృత్తులను ప్రదర్శించడం గొప్ప విషయమన్నారు. వస్తువుల తయారీలో మెలుకువలు, ప్యాకింగ్, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తయారీ, తదితరాలపై మహిళా సంఘాల సభ్యులు అవగాహన పెంచుకోవడానికి సరస్ మంచి వేదిక అన్నారు. ఇక్కడి ఉత్పత్తులను పరిశీలించడానికి జిల్లాల నుంచి మహిళా సంఘాల సభ్యులను రప్పించే ఏర్పాట్లు చేయాలని సెర్ప్ సిబ్బందిని మంత్రి ఆదేశించారు. సెర్ప్ సీఈఓ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల సభ్యులు వారి ఉత్పత్తులు అమ్మితేనే లాభాలు సమ కూరుతాయనీ, అందుకే ప్రతి ఏటా ఇలాంటి ఫెయిర్లు పెడుతున్నామని చెప్పారు. ప్రారంభ సభ అనంతరం మంత్రి దయాకర్‌రావు స్టాల్స్‌ను పరిశీలించారు. ఉత్పత్తుల గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా డైరెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ, నాబార్డు సీజీఎం చింతల సుశీల, ఎస్‌డీబీఐ జనరల్ మేనేజర్ వి.విజరు, శ్రీనిధి ఎమ్డీ జి.విద్యాసాగర్‌రెడ్డి, సెర్ప్ డైరెక్టర్ వై.నర్సింహారెడ్డి, ఎస్బీఐ డీజీఎమ్ బినోద్‌కుమార్ సిన్హా, యూబీఐ ఎఫ్‌జీఎమ్ సురేశ్‌చంద్ర, కెనరాబ్యాంకు జీఎం ఆర్.అనురాధ, టీజీబీ చైర్మెన్ వై.శోభ, తదితరులు పాల్గొన్నారు.