Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- చివ్వెంల
ఓ వ్యక్తి తమ భూమిని ఆక్రమించారని సూర్యాపేట జిల్లా ఐలాపురం ఎంపీటీసీ ధరావత్ బుచ్చమ్మ కుటుంబసభ్యులు గురువారం చివ్వెంల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగులమందు డబ్బా, పెట్రోల్ బాటిల్‌తో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఐలాపురం గ్రామ టీఆర్ఎస్ ఎంపీటీసీ ధరవాత్ బుచ్చమ్మ కుమారుడు ధరావత్ హరిసింగ్ ఐలాపురం శివారులోని సర్వే నెంబర్ 166లో ధరావత్ వెంకన్న దగ్గర 21 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ధరావత్ హరిసింగ్ కొనుగోలు చేసిన భూమిని గాంధీనగర్‌కు చెందిన రఫీ అనే వ్యక్తి ఆక్రమించుకొని దౌర్జన్యంగా భూమిలో హద్దురాళ్లు పాతి, ఎంపీటీసీ కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయంపై చివ్వెంల తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన నాయకుల ఒత్తిడి కారణంగా అధికారులు పట్టించుకుంటలేరని ఎంపీటీసీ ధరావత్ బుచ్చమ్మ కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పురుగుల మందు తాగి, పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. స్పందించిన రెవిన్యూ సిబ్బంది వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. తమకు న్యాయం చేయకపోతే కుంటుంబం అంతకలిసి ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తంచేశారు..స్థానిక పోలీస్ లను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.