Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణ-గజ్వేల్
బహుజన యోధుల గాథలను, విస్తృత బహుజన సాహితీ కళలు, గళాల చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కృషి కొనసాగుతోందని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో విస్తృత సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చే పని తెలంగాణ రాష్ట్ర అవతరణ నుంచి ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో 85 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీ అస్తిత్వ వాదాల సాహిత్యం వెలుగులోకి వస్తేనే అది సమగ్ర తెలుగు సాహిత్య చరిత్రగా రూపొందుతుందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రజతోత్సవాల సందర్భంగా గురువారం జరిగిన 'బహుజన స్ఫూర్తి ప్రధాతలు' జాతీయ సదస్సును జూలూరు గౌరీశంకర్ ప్రారంభించి మాట్లాడారు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు పాఠ్య పుస్తకాల్లో విస్తృతంగా బహుజన యోధుల చరిత్రలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇలాంటి చారిత్రకమైన పనికి తెలంగాణ ప్రభుత్వం సాహిత్య పరిశోధన తలుపులు తెరిచిందన్నారు. దేశాన్ని కమ్ముకొస్తున్న కుల, మత ఉన్మాదాలకు వ్యతిరేకంగా యువతరం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. విభిన్నత్వంతో కలిసి ఉన్న దేశాన్ని కులం, మతాలతో ముక్కలుగా విభజిస్తే దేశం అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 50 శాతానికి మించి ఉన్న బహుజనుల కుల గణన చేయమంటే కేంద్ర ప్రభుత్వం తిరస్కార ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా నిర్లక్ష్యంతో పెడచెవిన పెట్టిందని తెలిపారు. తెలుగు సాహిత్యంలో స్త్రీవాద, దళిత, బీసీ, మైనార్టీ, ఆదివాసీ, గిరిజన సాహిత్య వాదాలను జూలూరు తన ప్రసంగంలో రేఖామాత్రంగా విశ్లేషించారు. ఈ జాతీయ సదస్సుకు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించగా సదస్సు లక్ష్యాలను ప్రొ.వెల్దండి శ్రీధర్ వివరించారు. ప్రముఖ తెలంగాణ సాహిత్య విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్ కీలకోపన్యాసం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు ప్రొ||డి.కాశీం బహుజన స్ఫూర్తి ప్రధాతలపై సవివరంగా విశ్లేషించారు. సదస్సులో లెఫ్టినెంట్ ఎం.భవానీ, కళాశాల అకాడమిక్ సంచాలకులు మాచర్ల బాలరాజు, ఎల్.ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.