Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు నెలలైనా అమలు కాని వైనం
- రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో కదలని ఏపీడీ
- సర్క్యులర్ అమలు కాకపోవడంపై అనుమానాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆ సొసైటీ స్థాపించిన ఉద్దేశం..., లక్ష్యాలేంటో కానీ నిత్యం అధికారుల విచిత్ర నిర్ణయాలపైనే చర్చలు. ఉద్యోగుల్లో అసంతృప్తి. బదిలీలు, నియామకాలు అన్నింటిపైనా వెల్లువెత్తున్న ఆరోపణలు. నిరంతరం వివాదాస్పదంగా మారుతున్న అధికారుల వైఖరి. ఇదంతా రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి సంబంధించినవి. గతంలో ఎన్జీవోలకు అధిక మొత్తంలో చెల్లింపులు చేశారనే ఆరోపణలు వచ్చాయి. కొన్ని కార్యక్రమాల పేరుతో డబ్బులు వృధా చేశారనీ, వాటితో సాధించిన ఫలితం శూన్యమని విమర్శలు వెల్లువెత్తాయి. నిత్యం ఏదో ఒక వివాదాంశం సొసైటీ ఉద్యోగుల మధ్య జోరుగా చర్చకు దారి తీస్తున్నది. తాజాగా రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు మూడు నెలల క్రితం అంటే ఆగస్టు 18న అన్ని ప్రధాన కార్యాలయాలకు, జాతీయ కార్యక్రమాలకు సంబంధించిన తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని విభాగాల కార్యాలయాలకు సర్క్యులర్ జారీ చేశారు. ఎవరైతే ఫారీన్ సర్వీస్ డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారో వారంతా తిరిగి తమ తమ మాతృ శాఖలు, విభాగాలను ఏడు రోజుల్లో రిపోర్ట్ చేయాలన్నది ఆ సర్క్యులర్ సారాంశం.
ఈ క్రమంలో అన్ని కార్యాలయాలు, డిపార్ట్మెంట్లకు ఇచ్చినట్టుగానే రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి సర్క్యులర్ ఇచ్చారు. ఆ సొసైటీలో అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఫారీన్ సర్వీస్ డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న డాక్టర్ అన్న ప్రసన్న ఏడు రోజులు గడిచినప్పటికీ రిపోర్టు చేయలేదని సమాచారం. మూడు నెలలైనా కూడా ఉలుకుపలుకు లేకపోవడంపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే విషయంపై సమాచార హక్కు చట్టం కింద కొద్ది మంది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు దీనిపై వివరణ కోరారు. దీంతో ఆ ఇరువురు ఉన్నతాధికారులు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు అక్టోబర్ 10న ప్రత్యేకంగా లేఖ రాశారు. ఆ లేఖలో ఏపీడీగా ఇంకా కొనసాగుతున్న డాక్టర్ అన్నప్రసన్నను వెంటనే రిలీవ్ చేయాలని కోరారు. పైపెచ్చు గత నాలుగేండ్ల నుంచి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి నుంచి గానీ, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల నుంచి గానీ ఎలాంటి డిప్యూటేషన్, రెన్యువల్, కంటిన్యూయేషన్ కోసం తాము ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ ఇంకా అమలు కాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. వాటికి ఫుల్స్టాప్ పెట్టేందుకు ఇప్పటికైనా ఆ సర్క్యులర్ అమలు చేయాల్సిన అవసరముందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.