Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పాటకు జేజేలు' పేరిట మూడు రోజులపాటు నిర్వహణ
- జయప్రదానికి ప్రధాన కార్యదర్శి ఆనందాచారి పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్ -2022' ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు (20,21,22 తేదీల్లో) కొనసాగే ఈ ఫెస్ట్‌ను 'పాటకు జేజేలు' పేరిట నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో కవి గాయకుల సమ్మేళనం, సినిమా పాటల్లోని సాహిత్యంపై చర్చా గోష్టులను నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా వాగ్గేయకారులు, పాటల రచయితలు, కవులు, విమర్శకులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి తెలిపారు. హైదరాబాద్‌లోని ఎస్వీకేలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పాటలు, వాటి నేపథ్యం, కవుల పరిచయం, అభినందనలు తదితర కార్యక్రమాలను మూడు రోజులపాటు నిర్వహిస్తామని వెల్లడించారు. సినిమా పాటల సాహిత్యంపై పరిశోధకులతో సదస్సులు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఫెస్ట్‌ను ప్రారంభిస్తామని వివరించారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ ఫెస్ట్‌కు హాజరై జయప్రదం చేయాలని కవులు, రచయితలు, సాహితీవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో తెలంగాణ సాహితి ఉపాధ్యక్షులు రాంపల్లి రమేశ్, తంగిరాల చక్రవర్తి, సహాయ కార్యదర్శి సలీమా, ప్రతినిధి అనంతోజు మోహనకృష్ణ, నగర నాయకులు శరత్, రేఖా, ప్రభాకరాచారి పాల్గొన్నారు.
ప్రారంభ సభకు హాజరయ్యే ప్రముఖులు...
పద్మభూషణ్ పురస్కార గ్రహీత కే.ఐ.వరప్రసాదరెడ్డి, ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న, సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రసిద్ధ సినీ గేయ కవి సుద్దాల అశోక్ తేజ, ప్రసిద్ధ సాహితీ విమర్శకులు, పాత్రికేయులు తెలకపల్లి రవి, సినీ నటుడు మాదాల రవి, ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి నరేంద్ర, సామాజిక కార్యకర్త, రచయిత్రి పీఏ దేవి, నవతెలంగాణ పూర్వ సంపాదకులు ఎస్.వీరయ్య, కవి యాకూబ్, సినీ విమర్శకులు వంశీకృష్ణ, ప్రజా నాట్య మండలి కట్టా నర్సింహా, ప్రముఖ గేయ రచయిత దేవేంద్ర, సినీ నటుడు ఎల్బీ శ్రీరాం, ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, సినీ గేయ రచయితలు భువన చంద్ర, చైతన్య ప్రసాద్ తదితరులు.