Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి అవగాహనకు రావాలి
- దామాషా పద్ధతిలో ఎన్నికలను
- సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో అత్యంత ధనిక పార్టీ బీజేపీయేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఆపార్టీ విపరీతమైన డబ్బులను వెదజల్లుతున్నదనీ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నదనీ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని విమర్శించారు. దేశంలో ఎన్నికల సంస్కరణాలు రావాల్సిన అవసరముందనీ, దామాషా పద్ధతిన ఎన్నికలను నిర్వహించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందే ఫాసిస్టు, మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉమ్మడి అవగాహనకు రావాల్సిన అవసరముందన్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను, అధికారాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. జాతీయ విద్యా విధానాన్ని, జీఎస్టీని కేంద్రం రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నదని చెప్పారు. భారతదేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ సంపదను మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో రాష్ట్రంలో విచారణ కొనసాగుతున్నదనీ, మిగతా రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇలాగే ప్రవరిస్తున్నదని అన్నారు. సంక్షేమ దేశంగా ఉన్న భారత్ మోడీ పాలనలో పెట్టుబడి భారత్‌గా మారుతున్నదని చెప్పారు. రోజురోజుకూ నిత్యావసర ధరలు పెరుగుతున్నాయనీ, నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామన్న మోడీ హామీ ఏమైందని నిలదీశారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ పాలనలో గవర్నర్ల జోక్యం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను గవర్నర్లు ముందుకు తీసుకెళ్తున్నారని విమర్శించారు. ఇటీవల తమిళనాడు గవర్నర్ సనాతన ధర్మాన్ని ప్రస్తావించిన విషయాన్ని రాజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేరళ, తమిళనాడు, బెంగాల్‌తోపాటు తెలంగాణలో కూడా గవర్నర్ వ్యవస్థను కేంద్రం ఉపయోగిస్తున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ, లౌకిక పరిరక్షణకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక, ప్రాంతీయ పార్టీలు ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో అవగాహనతో ముందుకెళ్లాలని కోరారు. మారుతున్న రాజకీయ పరిణామాలను, బీజేపీ ప్రమాదాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు అంశం పెద్ద సమస్య కాదనీ, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ముందుకెళ్లే అంశంలో ఆ పార్టీ వైఖరిని మార్చుకోవాలని కోరారు. మరో రెండేండ్లలో సీపీఐ శతాబ్ది వార్షికోత్సవానికి చేరుకోబోతున్నదనీ, ఈ క్రమంలో పార్టీ సభ్యత్యాన్ని ఒక మిలియన్‌కు చేర్పించాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. ప్రయివేటు విమానాల ద్వారా హవాలా డబ్బు, బంగారు ఆభరణాలు తరలుతున్న నేపథ్యంలో వాటిని కూడా తనిఖీ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలు ఏకమైతే బీజేపీని ఓడించడం సులువవుతుందన్నారు. ఎన్నికల సమయంలోనే పొత్తుల అంశంపై చర్చలుంటాయనీ, అప్పటి వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఎన్నికల పొత్తులో భాగంగా తాము బలంగా ఉన్న స్థానాలను అడుగుతామన్నారు. బీజేపీని ఓడించే బలమైన ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలతోనే ఎన్నికల అవగాహన ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.